జనగామ, వెలుగు : జనగామ జిల్లాలోని ఆరు మండలాల్లో ఉన్న 123 ఎకరాల ఎస్సీ కార్పొరేషన్ భూమిని 72 గజాల చొప్పున ప్లాట్లుగా విభజించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన భూ సర్వే సమీక్షలో ఆయన మాట్లాడారు. సర్వేను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి, రోజుకు 20–25 ఎకరాలు సర్వే చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలోని 1,137 డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపును పారదర్శకంగా చేపట్టి, ఈ నెల 5లోగా పూర్తి చేయాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం డ్రా పద్ధతిలో ఇళ్లను కేటాయించాలన్నారు. గ్రామాల్లో అంగన్‌వాడీ, పంచాయతీ, వీవో భవనాల నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.
