- ఫైనాన్షియల్ అడ్వైజర్, కంప్యూటర్ ఆపరేటర్ల ఘనకార్యం..
- 11 మంది కాంట్రాక్టర్ల నుంచి రూ.7 కోట్లు రికవరీ
- లూటీ అయిన సొమ్ము రూ.70 కోట్లని ఊహాగానాలు
- ఎఫ్‌ఏను ట్రాన్స్ఫర్ చేసి ఆపరేటర్‌ను తీసేసిన అధికారులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టర్లు ఒక్కసారి పని చేస్తే అధికారులు రెండు సార్లు బిల్లులు చెల్లించారు. అంతేకాదు అదనపు చెల్లింపులు కూడా చేశారు. రెండేండ్లుగా ఈ తంతు కొనసాగుతుండగా బల్దియా అంతర్గత విచారణలో బయటపడింది. దీంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించగా బల్దియా ఇంటి దొంగలు ఈ పని చేశారని తేలింది.
ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్‌చంద్ర, కంప్యూటర్ ఆపరేటర్(ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్) తరుణ్ పాత్ర ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శరత్‌చంద్రను జీహెచ్ఎంసీ నుంచి ట్రాన్స్ఫర్ చేసి వదిలేయగా, తరుణ్‌ను రిమూవ్ చేశారు.
కాగా, 78 బిల్లుల్లో రూ.6.92 కోట్ల మేర తేడా వచ్చినట్టు గుర్తించామని, 74 బిల్లుల్లో రూ.6,83 లక్షలు , మరో 4 బిల్లుల నుంచి రూ.8 లక్షలు డీడీలు రికవరీ చేశామని బల్దియా ప్రకటించింది. ఇది ప్రాథమిక నిర్ధారణే అని, ఆడిట్‌లో మొత్తం బయటపడితే పూర్తిగా రికవరీ చేస్తామని స్పష్టం చేసింది.
ఇకపై ఒకసారి చెల్లించిన ఈఆర్‌పీ వోచర్‌ను మళ్లీ ప్రాసెస్ చేయకుండా సిస్టమ్‌లో మార్పులు చేశామని ప్రకటించారు. అయితే, లూటీ అయిన సొమ్ము మొత్తం భారీగా ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టలే..
బిల్లుల చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడిన ఆఫీసర్‌ను బదిలీ చేయడం, కంప్యూటర్ఆపరేటర్ను విధుల నుంచి తొలగించి సరిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆఫీసర్‌ను సస్పెండ్ చేయకపోవడం, క్రిమినల్ కేసులు నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో ఉన్నతాధికారుల పాత్రపైనా చర్చ మొదలైంది.
ఫైనాన్షియల్అడ్వైజర్బిల్లులు ఫైనల్ చేసిన తర్వాత ఫండ్స్రిలీజ్ చేసే ఫైనాన్స్ అడిషనల్ కమిషనర్ చూడకుండానే బిల్లులు ఎలా చేస్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు సార్లు, అదనంగా బిల్లులు తీసుకున్న కాంట్రాక్టర్ల నుంచి రికవరీ మాత్రమే చేశారని, బ్లాక్ లిస్ట్‌లో పెట్టి, చీటింగ్‌కేసులు నమోదు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది.
ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్‌తోనే..
జీహెచ్ఎంసీ వద్ద నిధులు అందుబాటులో లేని టైంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు జీహెచ్ఎంసీ ట్రెడ్స్ (ట్రేడ్ రిసీవబుల్స్ డిస్కౌంటింగ్ సిస్టమ్) విధానాన్ని రెండేండ్ల కింద తీసుకువచ్చారు. ఇందులో భాగంగా బల్దియా సిఫార్సు చేసిన కాంట్రాక్టర్లకే బ్యాంకులు ముందుగా బిల్లులు చెల్లిస్తాయి. పని చేశాక బిల్లుకు ఆడిట్ పూర్తవుతుంది.
తర్వాత ఫైనాన్స్ విభాగం బిల్లును ఆమోదించి కమిషనర్ అనుమతితో ట్రెడ్స్‌లో లిస్టింగ్ చేస్తుంది. ఆ బిల్లులను చెల్లించేందుకు బ్యాంకులు వడ్డీ రేట్లను ప్రతిపాదిస్తాయి. తక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకుల నుంచి కాంట్రాక్టర్లకు బిల్లులందుతాయి. ఇందుకోసం 18 బ్యాంకులతో బల్దియా ఒప్పందం చేసుకుంది.
ఒకసారి ట్రెడ్స్‌లో లిస్టింగ్ అయిన బిల్లును, బ్యాంకు చెల్లింపు ప్రక్రియ పూర్తయ్యేలోపే మళ్లీ ఆడిట్ చేసి ఫైనాన్స్ విభాగాలు లిస్టింగ్ చేయడంతో ఒకే బిల్లుకు రెండుసార్లు డబ్బులు మంజూరైనట్లు అధికారులు గుర్తించారు. కమిషనర్ ట్రెడ్స్‌లో బిల్లును లిస్టింగ్ చేయడానికి అనుమతిచ్చిన తర్వాత బ్యాంకు ప్రతిపాదనకు కాంట్రాక్టర్ అంగీకరించే వరకు సాధారణంగా 4 రోజులు పడుతుంది. ఈ వ్యవధిలోనే తెలివిగా అదే కాంట్రాక్టర్ బిల్లును మరోసారి ఆడిట్, ఫైనాన్స్ విభాగాలు కమిషనర్ అనుమతికి పంపిస్తున్నాయి.
దీంతో అప్పటికే ట్రెడ్స్‌లో ఉన్న బిల్లే మళ్లీ లిస్టింగ్ అయి, రెండోసారి చెల్లింపు జరుగుతున్నట్లు విచారణలో బయటపడింది. ట్రెడ్స్ అప్‌డేట్‌లో భాగంగా ఈ దందా బయటకు వచ్చింది.
