కల్యాణలక్ష్మికి  లైన్ క్లియర్..పథకం అమలుపై సింగిల్ జడ్జి స్టేను కొట్టేసిన హైకోర్టు

 కల్యాణలక్ష్మికి  లైన్ క్లియర్..పథకం అమలుపై సింగిల్ జడ్జి స్టేను కొట్టేసిన హైకోర్టు
  • స్కీమ్స్​కు నిధుల వినియోగంపై కాగ్ అభ్యంతరం చెప్పిందా
  • జీవోలతో పథకాల అమలు చట్ట విరుద్ధమని పేర్కొందా?.. పన్నెండేళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు?
  • పిటిషనర్​ను ప్రశ్నించిన హైకోర్టు సీజే అపరేష్ కుమార్ బెంచ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ఈ పథకాలను అమలు చేయడాన్ని సవాల్‌‌‌‌ చేస్తూ సింగిల్‌‌‌‌ జడ్జి విధించిన మధ్యంతర స్టేను ఎత్తివేస్తూ హైకోర్టు డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పథకాల అమలుకు మార్గం సుగమమైంది. చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అపరేశ్ కుమార్‌‌‌‌ సింగ్‌‌‌‌, జస్టిస్‌‌‌‌ జి.ఎం.మొహియుద్దీన్‌‌‌‌తో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌‌‌‌పై సుదీర్ఘంగా విచారణ జరిపింది. పథకాలు 2014 నుంచి అమల్లో ఉండగా, 12 ఏండ్లుగా లేనిది ఇప్పుడే ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పిటిషనర్‌‌‌‌ను ప్రశ్నించింది. పథకాల కోసం ప్రభుత్వ నిధులు వినియోగిస్తున్నప్పుడు వాటి వ్యయంపై కాగ్‌‌‌‌ ఎప్పుడైనా అభ్యంతరం వ్యక్తం చేసిందా? జీవోల ద్వారా పథకాలను అమలు చేయడం చట్టవిరుద్ధమని కాగ్‌‌‌‌ తన నివేదికల్లో ఎక్కడైనా పేర్కొందా? అని పిటిషనర్‌‌‌‌ను ధర్మాసనం ప్రశ్నించింది. కాగ్‌‌‌‌ నివేదికలో సుమారు రూ.94 కోట్ల నిధులకు సంబంధించిన లెక్కలపై అభ్యంతరం ఉందని పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది విజయ్‌‌‌‌ గోపాల్‌‌‌‌ తెలిపారు. అయితే ఆ అభ్యంతరాలు పథకాల అమలుకు సంబంధించిన జీవోలు చట్టవిరుద్ధమని లేదా నిధుల వ్యయం రాజ్యాంగ విరుద్ధమని కాగ్‌‌‌‌ తేల్చినట్లు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పథకాల కోసం నిధుల కేటాయింపు, వినియోగం, ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధతపైనా ధర్మాసనం ఆరా తీసింది. ప్రజాధనం వినియోగం చట్టవిరుద్ధంగా లేదా రాజ్యాంగ విరుద్ధంగా జరిగి ఉంటే కాగ్‌‌‌‌ తన ఆడిట్‌‌‌‌ నివేదికలో తప్పుపట్టి ఉండాల్సి ఉంటుందని పేర్కొంది.

పథకాల ఉద్దేశం వివరించిన ఏజీ

రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌‌‌‌ జనరల్‌‌‌‌ ఎ. సుదర్శన్‌‌‌‌ రెడ్డి పిటిషన్‌‌‌‌ విచారణార్హతనే ప్రధానంగా ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన అవివాహిత మహిళలకు వివాహ సమయంలో ఆర్థిక సాయం అందించేందుకు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా ఈ పథకాలను విస్తరించినట్లు వివరించారు. లబ్ధిదారులు 18 ఏళ్ల వయసు పూర్తి చేసిన తర్వాతే ఈ పథకాల ద్వారా ఆర్థిక సాయం అందుతుందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు తమ కుమార్తెలను చదివించేందుకు ప్రోత్సాహం లభించడంతోపాటు బాల్య వివాహాలను నిరుత్సాహపరిచే ఉద్దేశం కూడా నెరవేరుతోందన్నారు. బాల్య వివాహాల నిరోధానికి సంబంధించి సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో నొక్కిచెప్పిన లక్ష్యాలకు ఈ పథకాలు అనుగుణంగా ఉన్నాయని పేర్కొన్నారు.

పిటిషన్‌‌‌‌ విచారణార్హతపై ఏజీ అభ్యంతరం

పిటిషనర్‌‌‌‌ ఈ పథకాల లబ్ధిదారుడు కాదని, పథకాల వల్ల తనకు ఎలాంటి ప్రత్యక్ష నష్టం జరిగిందో, తన హక్కులకు ఎలా భంగం కలిగిందో చూపలేదని ఏజీ వాదించారు. పథకాల అమలు వల్ల పిటిషనర్‌‌‌‌కు ఎలాంటి నష్టం జరగలేదని, తన హక్కులకు భంగం వాటిల్లినట్లు కూడా ఆయన నిరూపించలేకపోయారని తెలిపారు. ప్రజాప్రయోజన వ్యాజ్యంగా కూడా పిటిషన్‌‌‌‌ దాఖలు చేయలేదని చెప్పారు. వ్యక్తిగత హోదాలో వేసిన పిటిషన్‌‌‌‌ను విచారించి సింగిల్‌‌‌‌ జడ్జి స్టే విధించడం సరికాదని వాదించారు. అందువల్ల పిటిషనర్‌‌‌‌ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణార్హత కలిగి లేదని, రిట్‌‌‌‌ న్యాయస్థానం ముందు ఈ పిటిషన్‌‌‌‌ కొనసాగదని ఏజీ స్పష్టం చేశారు.

స్టే ఎత్తివేత

పథకాల అమలు, ప్రభుత్వ ఉత్తర్వుల చట్టబద్ధత, ప్రజాధనం వినియోగం, కాగ్‌‌‌‌ నివేదికలు, పిటిషనర్‌‌‌‌ వ్యాజ్యం దాఖలు చేసే అర్హత తదితర అంశాలను పరిశీలించిన ధర్మాసనం.. పథకాల అమలును నిలిపివేస్తూ సింగిల్‌‌‌‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. దీంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ పథకాలపై ఉన్న స్టే తొలగిపోయింది. తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది. 

మంత్రి పొన్నం హర్షం

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌ పథకాల అమలుపై హైకోర్టు స్టే ఎత్తివేయడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెండింగ్‌‌‌‌లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి, అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. కోర్టు స్టే విధించిన సమయంలో కొందరు రాజకీయ లబ్ధి కోసం పథకాలు రద్దయినట్లు దుష్ప్రచారం చేశారని మంత్రి విమర్శించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగితే బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, బీజేపీ నాయకులకు ఎందుకంత సంతోషమని మండిపడ్డారు.