- టీజీసీహెచ్ఈతో యూకే వర్సిటీ ప్రతినిధుల కీలక చర్చలు
హైదరాబాద్, వెలుగు: యూకేలోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ తెలంగాణ యూనివర్సిటీలతో కలిసి పనిచేసేందుకు ముందుకు వచ్చింది. విద్య, పరిశోధన, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించుకునే దిశగా ఆ వర్సిటీ ప్రతినిధులు తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (టీజీసీహెచ్‌ఈ)తో జరిపిన చర్చలు ఫలించాయి. బర్మింగ్‌హామ్ వర్సిటీ డిప్యూటీ ప్రో-వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ మార్క్ లీ, ఆ వర్సిటీ గ్లోబల్ రీజినల్ డైరెక్టర్ శ్రీ దేవేష్ ఆనంద్ తదితరులు టీజీసీహెచ్‌ఈ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డితో సమావేశమయ్యారు.
125 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వర్సిటీతో విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, సంయుక్త పరిశోధనలు, క్లీన్ ఎనర్జీ, ఏఐ గవర్నెన్స్, ఎథిక్స్, స్పోర్ట్స్ సైన్స్, మెడిసిన్ తదితర కీలక అంశాలపై భేటీలో విస్తృతంగా చర్చించారు. ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త యూజీ కరిక్యులమ్‌లో తప్పనిసరి ఇంటర్న్‌షిప్‌లు, నైపుణ్య ఆధారిత కోర్సులు తెస్తున్నామని ఈ సందర్భంగా చైర్మన్ బాలకిష్టారెడ్డి వారికి వివరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ భారత క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని , డిసెంబర్‌లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న రైజింగ్ తెలంగాణ సమిట్‌లో పాల్గొనాలని ఆహ్వానించారు.
