శాతవాహన వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..హాస్టల్, మెస్ సమస్యలు పరిష్కరించాలి

శాతవాహన వర్సిటీలో విద్యార్థుల ఆందోళన..హాస్టల్, మెస్  సమస్యలు పరిష్కరించాలి

కరీంనగర్ టౌన్, వెలుగు: హాస్టల్, మెస్  సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్  చేస్తూ కరీంనగర్​లోని శాతవాహన యూనివర్సిటీ విద్యార్థులు మంగళవారం అడ్మినిస్ట్రేటివ్  బిల్డింగ్  ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాస్టల్, మెస్  బిల్లులు చెల్లించకుంటే విద్యార్థులే వంట సామగ్రి తెచ్చుకొని వంట చేసుకోవాలని చెబుతున్నారని వాపోయారు. 

హాస్టల్‌‌‌‌తో సంబంధం లేనట్లుగా వీసీ, రిజిస్ట్రార్  వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. మెస్  గ్రాసరీస్  ధరలను ఇష్టానుసారంగా పెంచి విద్యార్థులపై అదనపు భారం మోపుతున్నారని మండిపడ్డారు. విద్యార్థుల భోజనం, హాస్టల్, మౌలిక  సమస్యలను పరిష్కరించకుండా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టడం సరైంది కాదన్నారు.

 రూ.10 కోట్లతో గ్రౌండ్, రూ.5 కోట్లతో గ్యాలరీ, రూ.60 లక్షలతో జిమ్  తదితర పనులపై తప్ప తాము కోరుతున్నట్లు 24/7 లైబ్రరీ, ప్రస్తుత గ్రౌండ్, హాస్టల్, మెస్ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. నాణ్యమైన భోజనం అందించడంతో పాటు మెస్  గ్రాసరీస్  ధరల పెంపుపై స్పష్టత ఇవ్వాలని కోరారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో పోరాటాన్ని ఉధృతం  చేస్తామని హెచ్చరించారు.