మహాప్రస్థానం.. వివాదాస్పదం .. రూ.4.50 కోట్ల నుంచి  రూ.10 కోట్లు దాటిన బడ్జెట్

మహాప్రస్థానం.. వివాదాస్పదం .. రూ.4.50 కోట్ల నుంచి  రూ.10 కోట్లు దాటిన బడ్జెట్
  •     భారీ ఖర్చుపై అనుమానాలు, అవినీతి ఆరోపణలు
  •     ప్రైవేట్ ఏజెన్సీకి అప్పగించడంపై అభ్యంతరాలు
  •     ఓవైపు ప్రశంసలు.. మరోవైపు విమర్శలు 
  •     ఏడాదైనా బయటకు రాని విజిలెన్స్ రిపోర్ట్
  •     అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ మాటల యుద్ధం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో మహాప్రస్థానం నిర్మాణం, నిర్వహణ తీరుపై ఓవైపు ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు అదే స్థాయిలో విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా శ్మశానవాటికను ఆధునిక హంగులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడంతో అందరినీ ఆకట్టుకుంటున్నప్పటికీ అంచనాలకు మించి నిధులు ఖర్చు చేయడంతో అవినీతి ఆరోపణలు ముసురుకున్నాయి. మహాప్రస్థానం మెయింటన్స్​ను ప్రైవేట్ ​ఏజెన్సీకి అప్పగించడం, పేకాట క్లబ్​ ద్వారా నిధుల సమీకరణకు ఆదేశాలివ్వడం మరింత వివాదాస్పదమైంది. ఈ విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ ఏడాది కాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది.

రూ.10.22 కోట్లతో నిర్మాణం

జిల్లా కేంద్రంగా, కార్పొరేషన్​గా మంచిర్యాల అప్​గ్రేడ్​అయినప్పటికీ మొన్నటిదాక శ్మశానవాటికే లేదు. దీంతో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేయడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి సమీపంలోని నాలుగు ఎకరాలను వైకుంఠధామానికి కేటాయించారు. అందులో రూ.10.22 కోట్లతో ఆధునిక హంగులతో నిర్మించారు. గ్రీనరీతో పార్కును మరిపించేలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడమే కాకుండా సోలార్ ​పవర్​ సిస్టమ్​ ఏర్పాటు చేశారు. దహనవాటికలతో పాటు కర్మకాండలు నిర్వహించుకోవడానికి రూమ్​లు నిర్మించారు. మహాశివుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కేవలం నాలుగు నెలల్లోనే నిర్మాణం పూర్తయి వండర్​ బుక్​ రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. 

అంచనాలకు మించి ఖర్చు

వాస్తవానికి మంచిర్యాలలో రూ.4.42 కోట్లతో శ్మశానవాటిక నిర్మాణం కోసం 2024 సెప్టెంబర్​లో జరిగిన మున్సిపల్ ​కౌన్సిల్​తో తీర్మానం చేశారు. 2025లో పనులు మొదలైన తర్వాత అంచనాలు పెంచుతూ రెట్టింపునకు మించి ఖర్చు చేశారు. 14వ ఫైనాన్స్​నుంచి రూ.4 కోట్లు, స్పెషల్ డెవలప్​మెంట్​ఫండ్స్​రూ.42 లక్షలు, మున్సిపల్​ నిధులు రూ.5.8 కోట్లు మొత్తం రూ.10.22 కోట్లు వెచ్చించారు. కొన్ని పనులను అంచనాలు లేకుండానే చేపట్టారు. దీంతో కోట్లలో అవినీతి జరిగిందనే అనుమానాలు బలపడ్డాయి. ఈ విషయమై నిరుడు జూలైలో కరీంనగర్​లోని విజిలెన్స్​ అధికారులకు ఫిర్యాదులు వెళ్లగా, విచారణను తొక్కిపెట్టేందుకు కొంతమంది ప్రయత్నించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈకారణంగానేమో.. ఏడాదైనా విజిలెన్స్​ రిపోర్ట్ బయటకు రాలేదు. 

ఏజెన్సీకి అప్పగింతపై... 

మహాప్రస్థానం నిర్వహణను ఓ ఏజెన్సీకి అప్పగించడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్​ టెండర్​ ద్వారా నిబంధనల ప్రకారమే ఏజెన్సీకి అప్పగించినట్టు అధికారులు చెబుతున్నారు. సదరు ఏజెన్సీకి మున్సిపాలిటీ ఒక్క పైసా చెల్లించదని, అంత్యక్రియల ద్వారా వచ్చే డబ్బులతోనే మెయింటైన్​చేస్తారని చెబుతున్నారు. మానవీయ దృక్పథం, సేవాభావంతో నిరుపేదలకు ఉచితంగా, ఇతరులకు రూ.7వేల వరకు వసూలు చేస్తున్నారు. అయితే మహాప్రస్థానం నిర్వహణ ఖర్చుల సాకుతో పేకాట క్లబ్ నుంచి వసూళ్లు చేయడంపై విమర్శలున్నాయి. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, మున్సిపల్​ ఫండ్స్​తో నిర్మించినప్పటికీ.. కొందరు వ్యక్తిగత ప్రచారం కోసం పాకులాడడం ఏమిటని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇందులో జరిగిన అవినీతిని నిగ్గు తేల్చాలని, ప్రైవేట్​ఏజెన్సీని రద్దు చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్​చేస్తుండగా.. అధికార పార్టీ నేతలు సైతం దీటుగానే స్పందిస్తున్నారు.