- నాన్ అగ్రికల్చర్ కాలంలో సర్వే, బై నెంబర్లు, విస్తీర్ణంతో కొత్త లిస్ట్ అప్లోడ్
- ఇంకా అప్లోడ్ చేయని అగ్రికల్చర్లిస్ట్..
యాదాద్రి, వెలుగు : 22 ఏ జాబితాలో పేరున్న వారికి ఊరట లభించింది. ఇంటి నెంబర్లు, ఓనర్ల పేర్లు కలిగిన జాబితాను తొలగించారు. సర్వే నెంబర్లు, బై నెంబర్లతో కూడి కొత్త జాబితాను అప్లోడ్ చేశారు. దీంతో ఇండ్ల కొనుగోలు, అమ్మకాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.
పాత లిస్టులో 39,468 ఇండ్లు 22ఏలో..
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ ఆస్తులు చేతులు మారి అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటిని అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కాలంలోని నిషేధిత జాబితాలోని 22 ఏలో చేర్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది ఆరంభంలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లోని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ విభాగంలో లిస్ట్‌ను అప్లోడ్ చేశారు. క్షేత్రస్థాయికి వెళ్లకుండానే అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా ఇంటి నెంబర్లు, ఓనర్ల పేరుతోనే లిస్ట్ అప్లోడ్ చేశారు. దీంతో యాదాద్రి జిల్లాలోని 17 మండలాల్లోని 39,468 ఇండ్లను 22ఏలో చేర్చారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో నిర్మించిన ఇండ్లు, ప్రభుత్వేతర స్థలాల్లోని ఇండ్ల నెంబర్లతో పాటు ఓనర్ల పేరును కూడా 22ఏ(1), (ఏ) కింద చేర్చారు. క్రయ విక్రయాలు జరగని ప్రైవేటు భూముల్లోని ఇండ్లను వేరే సర్వే నెంబర్లో చూపించి నిషేధిత లిస్ట్‌లో చేర్చారు. ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఖాళీ ప్లాట్లను కూడా చేర్చారు. దీంతో అత్యవసరంగా ఖాళీ స్థలాలు, ఇండ్లు అమ్ముకుందామని ప్రయత్నించిన వారికి రిజిస్ట్రేషన్లు కాలేదు. దీంతో ఆందోళనకు గురయ్యారు. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
22ఏలో సర్వే నెంబర్లు.. విస్తీర్ణంతో కొత్త లిస్ట్
ప్రభుత్వ ఆదేశాలతో రెవెన్యూ డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. దాదాపు మూడు నెలలుగా కసరత్తు చేసి కొత్త లిస్ట్‌ను రూపొందించింది. ముందుగా స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లోని ప్రొహిబిటెడ్ కాలంలో 22ఏలో అగ్రికల్చర్, నాన్ అగ్రికల్చర్ కాలం నుంచి నుంచి వందల పేజీలతో కూడిన యాదాద్రి జిల్లా పాత లిస్ట్‌ను మూడు రోజుల కింద తొలగించారు. హయ్యర్ ఆఫీసర్లు ఆప్షన్ ఇవ్వడంతో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్‌సైట్‌లోని ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలో తహసీల్దార్లు లాగిన్ అయి ఒక్కో మండలానికి రెండు, మూడు పేజీలతో కూడిన కొత్త లిస్ట్ అప్లోడ్ చేశారు. ఈ లిస్ట్‌లో కేవలం సర్వే నెంబర్లు, బై నెంబర్లతో పాటు విస్తీర్ణం పేర్కొన్నారు. ఈ కొత్త లిస్ట్‌ను స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిశీలించి మంగళవారం నుంచి అందుబాటులోకి తెచ్చింది. అప్లోడ్ చేసిన కొత్త లిస్ట్‌తో ఇండ్ల క్రయవిక్రయాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆఫీసర్లు చెబుతున్నారు.
అగ్రికల్చర్లిస్ట్అప్లోడ్చేయలే..
ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ విభాగంలో నుంచి తొలగించిన అగ్రికల్చర్ లిస్ట్ స్థానంలో కొత్త లిస్ట్అప్లోడ్ చేయలేదు. గత లిస్ట్‌లో వివిధ వర్గాలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూముల క్రయవిక్రయాలు వివిధ మార్గాల్లో జరిగేది. ఈ ఏడాది ఆరంభంలో సర్వే నెంబర్లు, లబ్ధిదారుల పేర్లతో రూపొందించిన లిస్ట్‌ను 22ఏలోని అగ్రికల్చర్ కాలంలో అప్లోడ్ కావడంతో ఎక్కడివక్కడే ఆగిపోయాయి. తాజాగా అగ్రికల్చర్ కాలంలోని లిస్ట్‌ను కూడా తొలగించారు. నాన్ అగ్రికల్చర్ అప్లోడ్ చేసినప్పటికీ అగ్రికల్చర్ లిస్ట్ మాత్రం అప్లోడ్చేయలేదు.
