- టన్నుకు రూ.2 వేల జరిమానా.. ఆన్‌లైన్ విధానంలో వసూలు
- ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
- మైన్స్ సర్వైలెన్స్ సిస్టమ్ ద్వారా నిరంతర నిఘా
- రెండుసార్లు ఉల్లంఘిస్తే శాశ్వతంగా వెహికల్ బ్లాక్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, పరిమితికి మించి తరలించే ఓవర్‌లోడింగ్ వెహికల్స్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలో నడిచే ఇసుక రవాణాలో పరిమితి కంటే ఎక్కువ లోడుతో వెళ్లే వాహనాలపై టన్నుకు రూ.2 వేల చొప్పున భారీ జరిమానా విధించాలని గనుల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి ఎం. రఘునందన్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ‘మైన్స్ సర్వైలెన్స్ సిస్టమ్’ (ఎంఎస్‌ఎస్) ద్వారా నిరంతరం నిఘా ఉంచి, మార్గమధ్యంలో లేదా రీచ్‌ల వద్ద ఓవర్‌లోడింగ్‌ను గుర్తిస్తారు. అదనంగా తరలిస్తున్న ఇసుక పరిమాణాన్ని బట్టి లెక్కించి, నిర్దేశిత జరిమానా మొత్తాన్ని పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే వాహనదారుల నుంచి వసూలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలకు తావులేకుండా, నగదు రహిత పద్ధతిలో జరిమానాలు వసూలు చేసేందుకు వీలుగా పోర్టల్‌లో అవసరమైన మార్పులు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
పరిమితికి మించి రెండుసార్లు పట్టుబడితే బ్లాక్‌లిస్ట్
ఓవర్‌లోడింగ్ నిబంధనలను పదేపదే ఉల్లంఘించే వెహికల్స్‌పై ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. నిర్దేశిత పరిమితికి మించి ఇసుకను లోడ్ చేస్తూ రెండు సార్లకు మించి పట్టుబడితే, సదరు వాహనాన్ని శాశ్వతంగా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టనున్నారు. అలాంటి వాహనాలను అధికారిక ‘శాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’ (ఎస్‌ఎంఎస్) పోర్టల్ నుంచి పూర్తిగా తొలగించి, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఇసుక బుకింగ్‌లు చేసుకోకుండా సాంకేతికంగా నిరోధించనున్నారు. పరిమితికి మించి ఇసుక తరలించడం వల్ల గ్రామీణ, ప్రధాన రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ప్రమాదాలు సైతం పెరుగుతున్నాయన్న క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. కేవలం ఒకరిద్దరి స్వార్థం కోసం రోడ్ల మౌలిక వసతులు ధ్వంసం కాకుండా చూడటంతోపాటు సహజ వనరుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కఠిన నిబంధనలను రూపొందించారు.
.
