రంగనాథ్ కు రిలీఫ్..  హైడ్రా కమిషనర్ గా తప్పించాలన్న ఆదేశాలకు బ్రేక్

రంగనాథ్ కు రిలీఫ్..  హైడ్రా కమిషనర్ గా తప్పించాలన్న ఆదేశాలకు బ్రేక్

 

  • డివిజన్ బెంచ్​లో అప్పీల్ చేసిన రంగనాథ్
  • హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పుపై స్టే
  • శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్‌ కేసులో కీలక పరిణామం 
  • రంగనాథ్‌ తరఫున హిమాచల్ 
  • మాజీ సీజే రాజీవ్‌ శక్దర్‌ వాదనలు

హైదరాబాద్‌‌, వెలుగు: హైడ్రా కమిషనర్‌‌ ఏవీ రంగనాథ్‌‌కు హైకోర్టులో ఊరట లభించింది. కమిషనర్‌‌ పదవి నుంచి అతన్ని తప్పించి.. ఆయన స్థానంలో మరో వ్యక్తిని నియమించాలంటూ సింగిల్‌‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ డివిజన్‌‌ బెంచ్‌‌ ఆదేశాలు జారీ చేసింది. మేడ్చల్‌‌-మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని సర్వే నంబర్లు 1, 2లో గల 40 ఎకరాల భూమిలో ఈ నెల 17న హైడ్రా కూల్చివేతలు చేపట్టడాన్ని సవాల్‌‌ చేస్తూ శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్స్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌‌ జడ్జి.. రంగనాథ్‌‌ను హైడ్రా కమిషనర్‌‌ పదవి నుంచి తప్పించి, మరో అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు. ఈ ఉత్తర్వులను సవాల్‌‌ చేస్తూ రంగనాథ్‌‌ అప్పీల్‌‌ దాఖలు చేశారు. జస్టిస్‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌ నందికొండ నర్సింగరావుతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. కమిషనర్‌‌ పదవి నుంచి రంగనాథ్‌‌ను తప్పించాలన్న ఉత్తర్వుల అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. అలాగే,వివాదాస్పద 40 ఎకరాల భూమిలో యథాతథ స్థితిని కొనసాగించాలని స్పష్టం చేసింది.చర్యలు తీసుకునే ముందు భూమి రికార్డులు, కోర్టు ఉత్తర్వులను పరిశీలించాలని సూచించింది. వివాదాస్పద భూముల్లోకి వెళ్లే ముందు హైడ్రా కమిషనర్‌‌ మరింత అప్రమత్తంగా ఉండాలని హితవు పలికింది. 

ప్రభుత్వ భూముల రక్షణకే హైడ్రా చర్యలు..

రంగనాథ్‌‌ తరఫున సీనియర్‌‌ న్యాయవాది, హిమాచల్‌‌ప్రదేశ్‌‌ మాజీ ప్రధాన న్యాయమూర్తి రాజీవ్‌‌ శక్దర్‌‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో భాగంగానే హైడ్రా చర్యలు చేపట్టిందని, ఉద్దేశపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించలేదని తెలిపారు. జీఎల్‌‌ఆర్‌‌ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అధికారుల విజ్ఞప్తి మేరకు రక్షణ చర్యల్లో భాగంగా ఫెన్సింగ్‌‌ ఏర్పాటు చేశారని వివరించారు. లోతుకుంట సర్వే నంబర్లు 1, 2లోని శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్స్‌‌కు చెందిన 40 ఎకరాల భూమికి, జీఎల్‌‌ఆర్‌‌ 243లోని ప్రభుత్వ భూమికి మధ్య మూడు కిలోమీటర్ల దూరం ఉందన్నారు. ప్రభుత్వ భూములను రక్షించాలన్న ఉద్దేశంతో అధికారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, అందుబాటులో ఉన్న రికార్డులు, జియో కోఆర్డినేట్ల ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

కోర్టు కేసులను పట్టించుకోరా?

రంగనాథ్​ తరఫు లాయర్​ వాదనలపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కేవలం అధికారులు విజ్ఞప్తి చేశారని చర్యలు తీసుకుంటారా? భూమి రికార్డులు పరిశీలించరా? అని ప్రశ్నించింది. సర్వే నంబర్‌‌పై విచారణ లేకుండా చర్యలు ఎలా చేపడతారని ప్రశ్నించింది. ప్రభుత్వ భూములను రక్షించాల్సిన బాధ్యత హైడ్రాపై ఉన్నప్పటికీ, వివాదాస్పద అంశాలు పరిశీలించాల్సిన బాధ్యత కూడా ఉందని పేర్కొంది. ప్రభుత్వ భూముల రక్షణతోపాటు ప్రైవేట్‌‌ వ్యక్తుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేసింది. శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్స్‌‌ తరఫున న్యాయవాది సురేందర్‌‌రావు వాదిస్తూ..అధికారులు కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘించి తమ నిర్మాణాలను కూల్చివేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. రంగనాథ్‌‌ను  పదవి నుంచి రిలీవ్‌‌ చేయాలన్న సింగిల్‌‌ జడ్జి ఉత్తర్వుల అమలును నిలిపివేసింది. వివాదాస్పద భూమిలో హైడ్రా జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. విచారణను నవంబర్‌‌ 3కు వాయిదా వేసింది.