- పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వినియోగించండి
- స్వదేశీ వస్తువులను వాడుకోవాలి
- కిర్గిస్తాన్ నుంచి మోదీ ఇన్ స్టా సందేశం
- జీడీపీ 7.8% నమోదుపై ప్రధాని హర్షం
- ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపు
న్యూఢిల్లీ: బంగారం కొనొద్దని, విదేశీ ప్రయాణాలు మానుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి పిలుపునిచ్చారు. మేడిన్ ఇండియా వస్తువులనే కొనుగోలు చేయాలని సూచించారు. మంగళవారం ఈ మేరకు కిర్గిస్తాన్ నుంచి ఇన్‌స్టా వీడియో విడుదల చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలన్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాల నడుమ భారత్ సాధిస్తున్న ప్రగతి దేశ ప్రజల ఉమ్మడి శక్తికి నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8 శాతం వృద్ధి నమోదు చేయడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దేశ ప్రజలకు అభినందనలు తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై నైరాశ్యాన్ని, ‘అబద్ధాల హోరు’ను వ్యాప్తి చేస్తున్న వారికి ఈ తాజా వృద్ధి గణాంకాలే గట్టి సమాధానమని పేర్కొన్నారు. గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థలు స్తంభించిపోయి తీవ్ర అనిశ్చితి నెలకొన్న సమయంలోనూ భారత్ వేగంగా పురోగమిస్తోందని అన్నారు. ఈ ఆర్థిక బలాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పౌరులంతా స్వదేశీ వస్తువులు, సేవల వినియోగానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లడం తగ్గించుకోవాలని, డెస్టినేషన్ వెడ్డింగ్స్ పేరుతో ఇతర దేశాలకు వెళ్లకుండా ‘వెడ్ ఇన్ ఇండియా’ నినాదంతో దేశీయంగానే వివాహాలు జరిపించాలని విజ్ఞప్తి చేశారు. అవసరం లేకుంటే అనవసరంగా బంగారం కొనుగోళ్లు చేయవద్దని, తద్వారా దేశ విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడకుండా కాపాడుకోవచ్చని స్పష్టం చేశారు.
పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసిన 7 శాతం కంటే ప్రస్తుత వృద్ధి రేటు ఎక్కువని ప్రధాని మోదీ తెలిపారు. ‘‘అమెరికా–- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా సంక్షోభం, ఇంధన సరఫరా అవరోధాలను తట్టుకొని భారత ఆర్థిక వ్యవస్థ రాణించడం విశేషం. ఈ వృద్ధిని దేశ ప్రజలు వేడుకలా నిర్వహించుకోవాలి” అని పిలుపునిచ్చారు. 2020 కొవిడ్ మహమ్మారి తర్వాతి నుంచి ప్రపంచవ్యాప్తంగా అస్థిరత నెలకొన్నప్పటికీ, సరైన ప్రభుత్వ విధానాలు, నిబద్ధత కారణంగా భారత్ అద్భుత ప్రగతి సాధిస్తోందని మోదీ పేర్కొన్నారు. స్వయం సమృద్ధిని నిరంతరం కొనసాగిస్తే, స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల నాటికి నేటి యువత చేతుల్లో ‘వికసిత భారత్’ను ఉంచగలమన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని పేర్కొన్నారు. మన విధానం సరైనదని, లక్ష్యం స్పష్టంగా ఉందని, 140 కోట్ల మంది భారతీయుల సంకల్ప బలమే దేశాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తోందని చెప్పారు. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఈవీ వాహనాలను ప్రోత్సహించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ఆకాంక్షించారు.
జీడీపీ గణాంకాలతో ప్రతిపక్షాల అబద్ధాలు పటాపంచలు
దేశ ఆర్థిక వ్యవస్థ సాధించిన తాజా జీడీపీ గణాంకాలు ప్రతిపక్షాలు వ్యాప్తి చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేశాయని మోదీ స్పష్టం చేశారు. ‘‘ఒకవైపు ప్రపంచం సంక్షోభంలో ఉంటే, మరోవైపు దేశంలో నిరాశలో మునిగిపోయిన కొందరు అబద్ధాల మోత (ఝూఠ్ కీ గూంజ్) మోగిస్తున్నారు. వాటన్నింటినీ తుత్తునియలు చేస్తూ దేశం 7.8 శాతం వృద్ధి సాధించింది’’ అని రాహుల్‌గాంధీపై పరోక్షంగా విమర్శలు చేశారు.
