- మా దేశంలో వరదలకు భారత్, చైనా, అమెరికా ఉద్గారాలే కారణం: నేపాల్
- ఈ నష్టానికి తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్
- ‘లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్’ కోసం లేఖ
- 1,130కి పెరిగిన మృతులు.. ఇంకా 4,500 మంది మిస్సింగ్
- నేపాల్‌లో భారీ వర్షాలు.. డేంజర్ లెవెల్‌లో మూడు నదులు
ఖాట్మాండు: నేపాల్‌లో సంభవించిన భయంకరమైన ఆకస్మిక వరదలకు భారత్, చైనా, అమెరికా దేశాలు విడుదల చేస్తున్న గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలే కారణమని ఆ దేశం ఆరోపించింది. ఆయా దేశాల కాలుష్యం వల్లే హిమానీనదాలు (గ్లేసియర్లు) కరిగిపోయి తమ దేశంలో ఇలాంటి పెనుముప్పులు తలెత్తుతున్నాయని.. ఈ నేపథ్యంలో తమకు కావాల్సింది సహాయం కాదని.. నష్టపరిహారమని డిమాండ్ చేస్తున్నది. ఇది కేవలం సహాయం కోరడం కాదని.. తమ హక్కు, నైతిక బాధ్యత అని నేపాల్ స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక సహాయాన్ని కోరేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు ప్రారంభించిన నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్.. ఓ టీవీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. గ్రీన్‌హౌస్ ఉద్గారాల విడుదలలో తమ పాత్ర నామమాత్రంగానే ఉన్నప్పటికీ.. వేగంగా కరిగిపోతున్న హిమానీనదాలు, తీవ్రమైన పర్వత ప్రాంత విపత్తులతో సహా గ్లోబల్ వార్మింగ్ తాలూకు దుష్పరిణామాలను నేపాల్ అసమానంగా ఎదుర్కొంటోందని ఆయన ఎత్తిచూపారు. నేపాల్ తన దౌత్య విధానాన్ని సహాయం నుంచి న్యాయం, పరిహారం వైపు మళ్లిస్తోందని ఖనాల్ తెలిపారు. ప్రపంచంలోనే అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్న చైనా, రెండో స్థానంలో ఉన్న అమెరికా, మూడో స్థానంలో ఉన్న భారత్ వంటి ప్రధాన పారిశ్రామిక దేశాలకు.. నేపాల్ వంటి చిన్న దేశాలకు పరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. వాతావరణ మార్పుల అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై సంపూర్ణ దృఢత్వంతో, స్పష్టతతో లేవనెత్తాలని ఖాట్మాండు యోచిస్తోందని, దుర్బల దేశాలు ఎదుర్కొంటున్న వాతావరణ సంబంధిత నష్టాలకు ప్రధాన ఉద్గార దేశాల నుంచి పరిహారం కోరతామని ఖనాల్ తెలిపారు.
లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ బోర్డుకు లేఖ
ఆకస్మిక వరదల కారణంగా జరిగిన భారీ నష్టం నేపథ్యంలో అత్యవసర ఆర్థిక సహాయం కోరుతూ నేపాల్ ప్రభుత్వం కాప్ (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్) 27 (2022) ప్రకారం ఏర్పాటైన ‘ఫండ్ ఫర్ రెస్పాండింగ్ టు లాస్ అండ్ డ్యామేజ్' బోర్డును అధికారికంగా ఆశ్రయించింది. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే, అటవీ, వ్యవసాయ శాఖ మంత్రి గీతా చౌదరి సంయుక్తంగా లేఖ రాశారు. విపత్తుపై తక్షణమే స్పందించాలని కోరారు.
1,130కి పెరిగిన మృతులు
నేపాల్‌లో వరదల కారణంగా బుధవారం వరకు 1,130 మంది మృతిచెందారు. నేపాల్‌లో 1,114 మంది, చైనాలో 16 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. ఇంకా దాదాపు 4,900 మంది గల్లంతయ్యారని పేర్కొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 12 వేల మందిని రక్షించినట్టు తెలిపారు. గాలింపు, సహాయక చర్యల కోసం ఆర్మీ, పోలీసులు సహా 21 వేల మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించినట్టు అధికారులు తెలిపారు. వరదల వల్ల నేపాల్‌లో సుమారు 16 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారని చెప్పారు.
నేపాల్‌లో భారీ వర్షాలు.. మళ్లీ వరదల ముప్పు
నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 12 గంటల్లో సింధుపాల్‌చోక్‌లోని నోస్యం పతి వద్ద 60.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ కాలంలో ఇదే అత్యధిక వర్షపాతం. ఈ నేపథ్యంలో నేపాల్ కు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో అధికారులు ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సింధులి జిల్లాలోని సన్ కోషి నది, గోర్ఖా జిల్లాలోని బుధి గండకి నది, దాడెల్ధురా జిల్లాలోని మహాకాళి నదుల్లో నీటి మట్టాలు హెచ్చరిక స్థాయిలను దాటాయని అధికారులు పేర్కొన్నారు.
ఆప్తుల దిష్టిబొమ్మలకు అంత్యక్రియలు..
నేపాల్ జల ప్రళయంలో కనీసం మృతదేహాలు కూడా దొరకకుండాపోయిన తమ ఆప్తులకు బాధిత కుటుంబాలు ఇలా ఎండు గడ్డి, పిండితో దిష్టిబొమ్మలను చేసి.. అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఖాట్మాండులోని పశుపతినాథ్ ఆలయం వద్ద అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యాలివి.
ప్రపంచం దృష్టికి క్లైమేట్ చేంజ్ సమస్య: బాలెన్షా
నేపాల్‌లో సంభవించిన విధ్వంసకరమైన ఆకస్మిక వరదలకు.. వాతావరణ మార్పులకు ఉన్న సంబంధాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి బలంగా తీసుకెళ్లాలని ఆ దేశ ప్రధాని బాలేంద్ర షా అన్నారు. బుధవారం ఆయన నేపాల్లోని ప్రతినిధుల సభలో ప్రసంగించారు. ‘ఎక్స్పర్ట్స్ప్రకారం, రసువా జిల్లాలోని భోటేకోషిలో సంభవించిన ఆకస్మిక వరద హిమాలయాల్లోని హిమపాతం వల్ల సంభవించింది. ఈ విపత్తుకు వాతావరణ మార్పులతో సంబంధం ఉందనే వాస్తవాన్ని మనం అంతర్జాతీయ సమాజానికి బలంగా తెలియజేయాలి. వాతావరణ మార్పుల వెనుక ప్రపంచవ్యాప్త పాత్ర ఉంది. దాని ప్రభావాలను నియంత్రించి, తగ్గించే బాధ్యత కూడా ప్రపంచ సమాజంపైనే ఉంది’ అని బాలెన్ షా నొక్కిచెప్పారు. మరోవైపు ఈ విపత్తు సమయంలో భారత్, చైనా వివిధ రకాలుగా సహాయం చేశాయని, అందుకుగాను ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
