సైఫాబాద్, వెలుగు: ఎస్సీ రిజర్వేషన్లలో అమలు చేస్తున్న రోస్టర్ విధానం వల్ల మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందల భాస్కర్ అన్నారు. రోస్టర్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సవరించి 20 లోపు రెండు రోస్టర్ పాయింట్లను మాలలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ సైఫాబాద్‌లో రాష్ట్ర నాయకులతో భవిష్యత్ కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్‌తో కలిసి మాట్లాడుతూ.. రోస్టర్ విధానంలో మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దేందుకు డిసెంబర్ 1 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి గడువు ఇస్తున్నట్లు చెప్పారు. సమస్యను పరిష్కరించకపోతే డిసెంబర్ 1న హైదరాబాద్‌లో లక్షలాది మందితో ‘మాలల యుద్ధభేరి’ సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జేఏసీ వర్కింగ్ చైర్మన్ మంత్రి నరసింహయ్య, తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్‌రావు, నామ సైదులు, జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.
