ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత విడిపోయిన తెలుగు రాష్ట్రాల నీటి రాజకీయాలను దగ్గరగా చూస్తున్న ఒక జర్నలిస్టుగా, వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం..కొత్త వేదికపై, కొత్త పాత్రధారులతో మళ్లీ ప్రదర్శితమవుతున్న పాత కథగానే కనపడుతోంది. కృష్ణమ్మ నీళ్లు ఎవరివి? ఎవరి వాటా ఎంత? అనేది 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి తేల్చలేకపోయారు. విభజన జరిగి పుష్కర కాలం గడిచినా ఇప్పటికీ నీటి వివాదాల మధ్య కృష్ణా జలాలు నలిగిపోతున్నాయి. వెలిగొండ సొరంగం ద్వారా ఇప్పటికే దాదాపు 11 టీఎంసీల నీరు శ్రీశైలం నుంచి తరలించినట్టు తెలుస్తోంది. ఇది కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) త్రిసభ్య కమిటీ తుది నిర్ణయం తీసుకోకముందే జరిగింది. ఇలా ‘ముందుగా తరలించి, తర్వాత అనుమతి కోసం అడగడం’ అనే పద్ధతి కృష్ణా బేసిన్ లో కొత్తేమీ కాదు. కానీ ఇది పదేపదే జరగడమే అసలు సమస్య.
ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల వల్ల శ్రీశైలం, జూరాల, నాగార్జున సాగర్ జలాశయాలకు వచ్చే ప్రవాహాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని తెలంగాణ వ్యవసాయ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. భూగర్భ జలమట్టాలు గత ఏడాదితో పోలిస్తే బాగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో వెలిగొండ పేరుతో నీరు తరలించటం ఒకింత బాధాకరం. మల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జున సాగర్ కుడికాలువ ద్వారా గత దశాబ్దన్నర కాలంలో ఏపీ వైపు నుంచి కృష్ణా జలాల తరలింపు పదేపదే జరిగింది, ప్రతిసారి ‘అత్యవసర తాగునీటి అవసరం’ అనే వాదననే ముందుకు తెచ్చారు. ఆ పరంపరలో తాజాగా ఇప్పుడు వెలిగొండను చేర్చారు.
కంటి ముందు నీరు కనపడుతున్నా..
కంటి ముందు నీరు కనపడుతున్నా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ రైతులు వాడుకోలేని దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇది కేవలం సాంకేతిక వాదన కాదు, భూమి మీద నిజంగా జరుగుతున్న సంక్షోభం. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ వంటి ఎత్తిపోతల పథకాల ఆయకట్టు రైతులను నేరుగా కలిసి మాట్లాడిన సందర్భాలున్నాయి. నీరు ఆలస్యంగా వస్తే పంట నష్టం ఎంత భారీగా ఉంటుందో వారు చెప్పే బాధ ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ఆయకట్టు ఇప్పటికే నీటి కొరతతో సతమతమవుతున్న మాట వాస్తవం. త్రిసభ్య కమిటీ, కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోకముందే నీటి తరలింపు జరగడం అనేది సంస్థాగత పర్యవేక్షణ లోపాన్ని సూచిస్తుంది. బోర్డుకు తగినంత అమలు అధికారం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితులు పదేపదే తలెత్తుతున్నాయని సర్వత్రా ఉన్న అభిప్రాయం.
టీడీపీ, వైఎస్సార్సీపీ గేమ్ ప్లాన్
వెలిగొండ ప్రాజెక్టు శ్రీశైలం జలాశయం ఫోర్షోర్ నుంచి 43.50 టీఎంసీల నీటిని రెండు సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు తరలిస్తుంది. దీని లక్ష్యం ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, ఫ్లోరైడ్ కలుషిత భూగర్భజలాలతో బాధపడుతున్న 15.25 లక్షల మందికి తాగునీరు అందించడం. 1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయగా, ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సొరంగాల తవ్వకం సహా ప్రధాన నిర్మాణ పనులు జరిగాయి. ఈ చరిత్రే ఇప్పుడు టీడీపీ, వైఎస్సార్సీపీ మధ్య క్రెడిట్ యుద్ధానికి కారణమైంది. ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇంకా రూ.4,000 కోట్లు, రెండేళ్లు పడుతుందని అధికారిక అంచనా. ఈ క్రెడిట్ రాజకీయం అసలు సమస్య నుంచి దృష్టి మళ్లించే ఒక గేమ్ ప్లాన్ మాత్రమే అని అనుకోవచ్చు. అసలు ప్రశ్న ఎవరు కట్టారు అనేది కాదు. ఎలా, ఎంత నీరు, ఎవరి అనుమతితో తరలిస్తున్నారు అనేదే.
త్రిసభ్య కమిటీ ఆమోదం తప్పనిసరి
కేఆర్ఎంబీ నియమాల ప్రకారం కృష్ణా బేసిన్‌లోని ఏ ప్రాజెక్టు నుంచి నీటిని వాడుకోవాలన్నా త్రిసభ్య కమిటీ ఆమోదం తప్పనిసరి. కానీ క్షేత్రస్థాయిలో గమనించిన వాస్తవం ఏమిటంటే.. ఈ నియమం తరచూ కాగితాలకే పరిమితమవుతోంది. ఏపీ అధికారులు ముందుగా నీటిని తరలించడం మొదలుపెట్టి, ఆ తర్వాత చర్చలు, అనుమతుల ప్రక్రియ కొనసాగించడం అనే పద్ధతి పదేపదే కనిపిస్తోంది. టెలిమెట్రీ ఆధారిత పారదర్శక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం వల్ల వాస్తవ వినియోగం ఎంత అనేది కూడా చాలాసార్లు తెలియదు. గత చరిత్రను చూస్తే, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరిగిన అన్యాయం కొత్తది కాదు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఇప్పటివరకు, తాత్కాలిక నీటి పంపిణీ ఏర్పాటు (66:34 నిష్పత్తి ఆధారంగా) కొనసాగుతూనే ఉంది. శాశ్వత ట్రిబ్యునల్ అవార్డు అమలుకాకపోవడం వల్ల ప్రతి వర్షాకాలంలోనూ, ప్రతి కొత్త ప్రాజెక్టు ప్రారంభమైనప్పుడూ ఇదే తరహా వివాదం పునరావృతమవుతోంది.
మిగులు జలాలపై శాశ్వత హక్కు ఎవరిది?
బచావత్ ట్రిబ్యునల్ నికర జలాలను కేటాయించింది. కానీ వర్షాకాలంలో నదిలో అదనంగా ప్రవహించే మిగులు జలాలపై శాశ్వత హక్కు ఎవరిదీ స్పష్టంగా నిర్ణయం కాలేదు. ఏపీ వాదన ఏమిటంటే.. ఈ మిగులు జలాలపై ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హక్కు లేదు. కాబట్టి, ముందు వాడుకున్న రాష్ట్రానికే అవి దక్కుతాయి. తెలంగాణ వైపు నుంచి ఈ వాదననే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మొత్తం లభ్యతే తగ్గుతున్న కాలంలో ‘మిగులు జలాలు’ అనే భావననే ఒక సాకుగా వాడుకుని, ఏటా భారీగా నీటిని తరలించే అవకాశం ఏపీకి దక్కుతున్నది వాస్తవం. ట్రిబ్యునల్ అవార్డు నోటిఫికేషన్ లేకపోవడం, కేఆర్ఎంబీకి తగినంత అధికారం లేకపోవడం, పారదర్శక పర్యవేక్షణ వ్యవస్థ లేకపోవడం, ఇవి మూడూ కలిసి ప్రతి వర్షాకాలాన్ని ఒక కొత్త యుద్ధభూమిగా మారుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో, కేఆర్ఎంబీతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ, టెలిమెట్రీ వ్యవస్థ బలోపేతం కోసం, ట్రిబ్యునల్ అవార్డు నోటిఫికేషన్ కోసం పట్టుబట్టడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులను నివారించవచ్చునని నా విశ్వాసం. అందుకోసం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా అధికార, ప్రతిపక్షాలు ఏకమై పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
- శ్యామ్ వేలూరి
సీనియర్ జర్నలిస్ట్
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచన 700 పదాలకు మించరాదు.
