వెలుగు ఓపెన్ పేజీ : ఉన్నత న్యాయస్థానంలో  అంతా సవ్యమేనా?

వెలుగు ఓపెన్ పేజీ : ఉన్నత న్యాయస్థానంలో  అంతా సవ్యమేనా?

ఉన్నత  న్యాయవ్యవస్థలో  అంతా  సవ్యంగా లేదని  సూచించే పరిణామం ఇటీవల మళ్లీ చోటు చేసుకుంది.  గతంలో  2018వ  సంవత్సరంలో  సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి  జస్టిస్‌‌‌‌  జాస్తి చలమేశ్వర్​ నేతృత్వంలో  నలుగురు సుప్రీంకోర్టు  న్యాయమూర్తులు  జస్టిస్‌‌‌‌ రంజన్‌‌‌‌ గొగోయ్,  జస్టిస్  మదన్‌‌‌‌ బి లోకూర్‌‌‌‌‌‌‌‌,  జస్టిస్‌‌‌‌ కురియన్‌‌‌‌ జోసెఫ్‌‌‌‌లు ఒక అసాధారణ, చారిత్రాత్మక పత్రికా గోష్ఠిని  నిర్వహించి సుప్రీంకోర్టులో పరిస్థితి బాగాలేదని దేశ ప్రజలకు తెలియజేశారు.  ఆ నలుగురు అలా చెప్పి పది సంవత్సరాలు గడవకముందే అలాంటి పరిస్థితి ఇంకా అలాగే ఉందన్న విషయం తరచూ తెలుస్తూనే ఉంది.  రాజస్తాన్‌‌‌‌  హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సంజీవ్‌‌‌‌ ప్రకాశ్‌‌‌‌ శర్మ తన అధికారాలను  దుర్వినియోగం చేస్తున్నారని,  సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ సందీప్‌‌‌‌ మెహతా ఆరోపించి ఉన్నత న్యాయవ్యవస్థలో అంతా సవ్యంగా లేదని మరోసారి దేశానికి గుర్తు చేశారు. 

రాజస్తాన్‌‌‌‌  హైకోర్టు తాత్కాలిక  ప్రధాన న్యాయమూర్తి  ఎస్‌‌‌‌పీ శర్మను  మరో  హైకోర్టుకి  బదిలీ చేయాలని,  మరో  హైకోర్టుకి చెందిన న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌  సందీప్‌‌‌‌ మెహతా  భారత  ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌‌‌‌కి లేఖ రాశారు.  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి  శర్మ తన అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారని సందీప్‌‌‌‌ మెహతా ఆరోపించారు.  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి  తన పరిపాలనా అధికారాలను దుర్వినియోగం చేసి  ‘ధనిక కక్షిదారులకు’ అనుకూలంగా కేసుల జాబితాను తారుమారు చేస్తున్నారని ఆయన తన లేఖలో ఆరోపించారు.  ఆగస్టు 2, 10, 17 తేదీలలో  రాసిన జస్టిస్‌‌‌‌ మెహతా  తాత్కాలిక  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్  శర్మపై ‘దుష్పరిపాలన’,  అక్రమ పద్ధతులు,  బంధుప్రీతి,  ‘పక్షపాతం’ వంటి ఆరోపణలు చేశారు.  అంతేకాకుండా  ఆయన  మాస్టర్‌‌‌‌‌‌‌‌  ఆఫ్‌‌‌‌  రోస్టర్‌‌‌‌‌‌‌‌గా  తన అధికారాలను ఉపయోగించి  కేసులను ఎంపిక చేసుకుని  తన  సొంత బెంచ్‌‌‌‌కి  తరలిస్తున్నారని కూడా ఆరోపించారు. 

సహేతుక కారణం లేకుండా.. 
కేసుల ఉపసంహరణ, బదిలీ

ఇతర  ధర్మాసనాల ముందు విచారణలో ఉన్న కేసులను ఎటువంటి  సహేతుకమైన కారణం లేకుండా అకస్మాత్తుగా ఉపసంహరించుకుని.. తన కోర్టుకి బదిలీ చేసుకున్నటువంటి  అనేక ఉదంతాలను తాను గతంలో భారత ప్రధాన న్యాయమూర్తి  దృష్టికి తీసుకువచ్చినట్లు  జస్టిస్‌‌‌‌  మెహతా పేర్కొన్నారు.  అటువంటి  జాబితాను  ఇవ్వమని  సీజేఐ  మొదట తనను  కోరారని,  అయితే  తర్వాత  ఆరోపణలను  రాతపూర్వకంగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి తగిన చర్య తీసుకుంటామని  హామీ  ఇచ్చారని  ఆయన  లేఖలో  పేర్కొన్నారు.  జస్టిస్‌‌‌‌  సందీప్‌‌‌‌  మెహతా కూడా రాజస్తాన్‌‌‌‌ హైకోర్టుకి  చెందిన వ్యక్తి. తన సొంత  హైకోర్టులో మరో రాష్ట్రానికి చెందిన  ప్రధాన న్యాయమూర్తి ఉండాలన్న తన అభ్యర్థనకు ఎటువంటి  సానుకూల స్పందన  రాలేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌‌‌‌  మెహతా  తన లేఖ లో రాశారు.  ఆగస్టు 10వ తేదీన  రాసిన తన  రెండో లేఖలో త్వరలో పదవీ విరమణ చేయబోతున్న  ప్రధాన న్యాయమూర్తి  శర్మ మరింత పెద్ద  సిక్సర్లు కొట్టడానికి చేసిన  ప్రయత్నాలకు  సంబంధించి  రెండు ఉదాహరణలను జస్టిస్‌‌‌‌ మెహతా భారత ప్రధాన న్యాయమూర్తి  దృష్టి కి తెచ్చారు. 

మొదటిది:

ఉదయ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని  విలువైన భూములకు  సంబంధించిన కొన్ని అప్పీళ్లను  జోధ్‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌లోని  ప్రధాన ధర్మాసనం  పరిధిలోకి వస్తే  అక్కడే విచారించాలని జస్టిస్‌‌‌‌ శర్మ స్వయంగా గతంలో తీర్పు చెప్పారు. దానికి భిన్నంగా ఆ కేసులను  జైపూర్‌‌‌‌‌‌‌‌లోని తన  నేతృత్వంలోని ధర్మాసనానికి బదిలీ చేశారని జస్టిస్‌‌‌‌ మెహతా ఆరోపించారు. 

రెండోది:

సింగిల్ జడ్జి  క్రిమినల్‌‌‌‌  కేసులో  ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ  మైనింగ్‌‌‌‌ దిగ్గజం  మేఘరాజ్‌‌‌‌ సింగ్‌‌‌‌కు సంబంధించినది.  సింగిల్‌‌‌‌ జడ్జి జారీ చేసిన ఉత్తర్వు సె.482 క్రిమినల్‌‌‌‌ ప్రొసీజర్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌కి సంబంధించినది దానిమీద స్పెషల్‌‌‌‌ అప్పీల్‌‌‌‌ రిట్‌‌‌‌గా  నమోదు చేసి తన బెంచ్‌‌‌‌ ముందు విచారణకు పెట్టేలా రిజిస్ట్రీని తప్పుదారి పట్టించారని ఆయన ఆరోపించారు. 457 రోజుల జాప్యాన్ని మన్నించి సింగిల్‌‌‌‌ జడ్జి ఉత్తర్వులోని ఆదేశంపై కేసు విచారణ మొదటిరోజే స్టే విధించడాన్ని జస్టిస్‌‌‌‌ మెహతా ఎత్తిచూపారు.  ఆగస్టు 17నాటి లేఖలో రాజస్తాన్‌‌‌‌ హైకోర్టు పరిపాలన గురించి,  జిల్లా కోర్టు న్యాయమూర్తుల పట్ల వ్యవహరిస్తున్న తీరును గురించి మరిన్ని ఆరోపణలను పేర్కొన్నారు. జిల్లా న్యాయవ్యవస్థలోని సీనియర్‌‌‌‌‌‌‌‌ జిల్లా జడ్జి  నందిని వ్యాస్‌‌‌‌ పట్ల జస్టిస్‌‌‌‌ శర్మ కక్షపూరిత చర్యలు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ ఆమె భర్త రాజస్తాన్‌‌‌‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌‌‌ ఉమాశంకర్‌‌‌‌‌‌‌‌  వ్యాస్‌‌‌‌ రాసినట్టుగా  భావిస్తున్న ఒక  మెసేజీని కూడా జస్టిస్‌‌‌‌ మెహతా  ప్రస్తావించారు. 

ఎవరీ జస్టిస్‌‌‌‌ శర్మ?

2016లో  రాజస్తాన్‌‌‌‌  హైకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్‌‌‌‌ శర్మ  2022వ  సంవత్సరంలో  పాట్నా  హైకోర్టుకి బదిలీ అయ్యారు. 2023లో  ఆరోగ్య కారణాల దృష్ట్యా తనను రాజస్తాన్‌‌‌‌ హైకోర్టుకి తిరిగి పంపాలన్న ఆయన అభ్యర్థనను  సుప్రీంకోర్టు కొలీజియం తిరస్కరించి ఆయనను పంజాబ్‌‌‌‌ అండ్‌‌‌‌ హర్యానా హైకోర్టు కి బదిలీ చేసింది.  మే 20, 2025న  ఆయనను తిరిగి తన సొంత రాష్ట్రానికి బదిలీ చేయాలని  సుప్రీంకోర్టు  కొలీజియం సిఫారసు చేసింది.  ఆ సిఫారస్‌‌‌‌  ప్రకారం  ఆయనను  జులై 14,  2025లో   కేంద్ర ప్రభుత్వం బదిలీ చేసింది.  సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 2025 నుంచి ఆయన రాజస్తాన్‌‌‌‌  హైకోర్టుకి  తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు.  ఆయన్ని ఎందుకు 2022లో పాట్నా హైకోర్టుకి బదిలీ చేశారో?  ఆ తరువాత ఆయన అభ్యర్థనని ఎందుకు తిరస్కరించారో?  తిరిగి  ఎందుకు  జైపూర్‌‌‌‌‌‌‌‌కి బదిలీ చేశారో  ఎవరికీ తెలియదు.  అందుకే  భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌‌‌‌ అభయ్‌‌‌‌ ఎస్‌‌‌‌.ఓకా తన పదవీ విరమణ  రోజు మే 2025లో ఇలా అన్నారు.  ‘భారత  సుప్రీంకోర్టు ఎక్కువగా ‘ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృతం’గా ఉంది, తన పరిపాలనా విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది.  హైకోర్టులు మాదిరిగా కాకుండా  సుప్రీంకోర్టులో  అనేక ప్రధాన పరిపాలనా కేసుల జాబితా నిర్ణయాలను భారత ప్రధాన న్యాయమూర్తి మాత్రమే తీసుకుంటారు’ అని ఎత్తి చూపారు. ఇది ఆలోచించాల్సిన విషయం.  కొలీజియం  నిర్ణయాలలో ప్రధాన న్యాయమూర్తి పాత్ర ఎక్కువ అన్న విషయం  జగద్విదితం. 

ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సిఫార్సు 

ఆగస్టు 31న సుప్రీంకోర్టు కొలీజియం (ప్రస్తుతం చత్తీస్‌‌‌‌గఢ్ హైకోర్టులో ఉన్న) జస్టిస్ సంజయ్ కె.అగర్వాల్‌‌‌‌ను రాజస్థాన్ రెగ్యులర్ ప్రధాన న్యాయమూర్తిగా  బదిలీచేసి  నియమించాలని  కేంద్రానికి  సిఫారసు చేసింది. 18 డిసెంబర్ 2025న, ప్రస్తుత  సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని కొలీజియం ఐదు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేసింది. ఆ తరువాత బదిలీల సిఫారసులు 2026 ఫిబ్రవరిలో జరిగాయి. అందులో ఒక విధాన ప్రకటన ఉంది. దాని ప్రకారం ప్రధాన న్యాయమూర్తి నియమితులైన వ్యక్తిని ముందుగానే  ఖాళీ ఏర్పడటానికి రెండు నెలల ముందు ఆ రాష్ట్ర హైకోర్టుకి బదిలీ చేయవచ్చు. న్యాయమూర్తులను ముందుగానే నియమించడం ద్వారా వారికి కోర్టుతో పరిచయం ఏర్పడేలా చేసి, నాయకత్వ లోపాన్ని ముందుగానే  నివారించవచ్చని ఆ పాలసీ ఉద్దేశం.అయితే, 6 ఆగస్టు 2026 నాటి తీర్మానం ప్రకారం నాలుగు  హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను సిఫారసు చేశారు. కానీ, ఈ విధానం స్పష్టంగా అమలు కాలేదు. ఈ సిఫార్సులకు ఎటువంటి  వివరణ ఇవ్వలేదు. నాయకత్వ లోపాన్ని  ఒక  తీవ్రమైన  సమస్యగా కొలీజియం  పరిగణించినప్పటికీ,రాజస్థాన్  హైకోర్టుని సెప్టెంబర్ 2025 నుంచి ఏసీజేతో తన పాత పద్ధతిలోనే  కొనసాగించింది. ఇది కొలీజియం నాయకత్వ లోపమని అనుకోవాలా?  మరోవిధంగా అనుకోవాలా? విజ్ఞులు ఆలోచించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృతంగా ఉండకుండా రాజ్యాంగ సవరణలు తీసుకోని రావలిసిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇంత దూరం వచ్చేదాకా ఎందుకు  ఉపేక్షించినట్టు?.  ఈ ప్రశ్నకి  సమాధానం దొరకడం కష్టమే.  ఏమైనా ఉన్నత  న్యాయవ్యవస్థలో  అంతా  సవ్యంగా లేకపోతే  న్యాయవ్యవస్థపై  అంతంత మాత్రంగా ఉన్న విశ్వాసం పూర్తిగా  సన్నగిల్లే  పరిస్థితి  ఏర్పడుతుంది. 

పరిస్థితి ఉద్రిక్తం

సుప్రీంకోర్టు న్యాయమూర్తి  జస్టిస్‌‌‌‌  మెహతా లేఖల  వివాదం నేపథ్యంలో బార్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌,  తాత్కాలిక  ప్రధాన న్యాయమూర్తి శర్మ కోర్టుని బహిష్కరించారు.  న్యాయవాదులెవరినీ  హాజరుకావడానికి అనుమతించడం లేదని తాత్కాలిక  ప్రధాన న్యాయమూర్తి  బహిరంగ కోర్టులో అన్నారు.  జస్టిస్‌‌‌‌  మెహతా చేసిన ఆరోపణలపై, ఆయన తన లేఖలలో ప్రస్తావించిన అంశాలపై ఇంకా విచారణ జరగలేదు.  ప్రధాన న్యాయమూర్తితో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకుంటూ తన సహచర  న్యాయమూర్తులని  బెదిరించారన్న ఆరోపణలను కూడా జస్టిస్‌‌‌‌ మెహతా తన ఆగస్టు 2 లేఖలో  పేర్కొన్నారు.

 గత  పదినెలలుగా జస్టిస్‌‌‌‌ శర్మ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. ఆయన సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 26న  పదవీ విరమణ చేయనున్నారు.  సిట్టింగ్‌‌‌‌ న్యాయమూర్తిపై వచ్చిన ఆరోపణలను  మీడియా ద్వారా విచారించలేమని, అది తప్పనిసరిగా సంస్థాగత మార్గాల ద్వారానే జరగాలని ఆగస్టు 20న భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌‌‌‌  సూర్యకాంత్‌‌‌‌ అన్నారు. అది వాస్తవమే.  కానీ ఆ విచారణ పూర్తి అయ్యేంతవరకు ఆయనను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడింది. 2026 ఆగస్టు 31న  జైపూర్,  జోధ్‌‌‌‌పూర్‌‌‌‌లలో ఊహించని రీతిలో నిరసనలు చెలరేగాయి. న్యాయవాదులు కోర్టు గది వెలుపల ధర్నాలు చేస్తూ,  నినాదాలు చేస్తూ,  విచారణను బహిష్కరించారు.  రాజస్థాన్  హైకోర్టు న్యాయవాదుల సంఘం 2026 సెప్టెంబర్ 6 వరకు సంపూర్ణ  సమ్మెను ప్రకటించింది.పరిస్థితులు విషమించడంతో జస్టిస్ శర్మ స్వచ్ఛందంగా న్యాయపరమైన పనుల నుంచి తప్పుకుని 2026 సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు సెలవుపై వెళ్లారు.

- డా. మంగారి రాజేందర్​
జిల్లా జడ్జి (రిటైర్డ్)

ఓపెన్​ పేజీకి  వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచన 700 పదాలకు మించరాదు.