కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి: పార్టీ నేతలకు రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ పిలుపు

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి: పార్టీ నేతలకు రాహుల్‌‌‌‌‌‌‌‌ గాంధీ పిలుపు

నాసిక్: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, ప్రజలకు న్యాయం జరిగేలా నిరంతరం పోరాడాలని  పార్టీ నాయకులకు అగ్రనేత రాహుల్ గాంధీ  పిలుపునిచ్చారు. బుధవారం మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో నూతనంగా ఎంపికైన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు నిర్వహించిన 10 రోజుల శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీషనర్ అయిన రాహుల్ గాంధీ, శిబిరంలో పాల్గొన్న నాయకులకు జపాన్ సాంప్రదాయ యుద్ధ కళ అయిన ‘జుజుట్సు’తో పాటు కరాటే మెళకువలను స్వయంగా ప్రదర్శించి చూపించారు. శారీరకంగా, మానసికంగా ఎలా దృఢంగా ఉండాలో ఆయన పార్టీ శ్రేణులకు వివరించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ భేటీలో నూతన అధ్యక్షులతోపాటు వారి కుటుంబ సభ్యులతోనూ రాహుల్ ముచ్చటించారు. 

మహారాష్ట్ర కాంగ్రెస్ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇటీవల నియమితులైన 69 మంది జిల్లా, నగర అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ఉదయం నాసిక్ చేరుకున్న రాహుల్ గాంధీ.. గిరిజన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో సమావేశమై వారితో వివిధ అంశాలపై చర్చించారు.