బెంగళూరు: ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న సౌత్ జోన్.. దులీప్ ట్రోఫీ ఫైనల్లోకి ప్రవేశించింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్ తిలక్ వర్మ (51 నాటౌట్) మెరుగ్గా ఆడటంతో.. బుధవారం ముగిసిన సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో నార్త్ జోన్‌పై గెలిచింది. నార్త్ నిర్దేశించిన 181 రన్స్ టార్గెట్‌ను ఛేదించేందుకు ఆఖరి రోజు బరిలోకి దిగిన సౌత్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 43.1 ఓవర్లలో 182/3 స్కోరు చేసి నెగ్గింది.
రికీ భుయ్ (42), నారాయణ్ జగదీశన్ (43) తొలి వికెట్‌కు 64 రన్స్ జోడించి శుభారంభాన్నిచ్చారు. అయితే ఒక రన్ తేడాతో రికీ, షేక్ రషీద్ (1) ఔట్ కావడంతో సౌత్ 65/2 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో వచ్చిన తిలక్, నారాయణ్‌తో కలిసి మూడో వికెట్‌కు 37, రవిచంద్రన్ స్మారన్ (32 నాటౌట్) నాలుగో వికెట్‌కు 80 రన్స్ జోడించి విజయాన్ని అందించారు. అబిద్ ముస్తాక్ 2 వికెట్లు తీశాడు.
అంతకుముందు 256/7 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 72.4 ఓవర్లలో 297 రన్స్‌కు ఆలౌటైంది. ఫలితంగా సౌత్ ముందు 181 రన్స్ టార్గెట్‌ను ఉంచింది. నిదేశ్ 5 వికెట్లు తీశాడు. తిలక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
