ఉప్పల్, వెలుగు: సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 11న రైస్ మిల్లులను బంద్ చేస్తామని రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఉప్పల్ భగాయత్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో పరిశ్రమ ఎదుర్కొంటున్న నష్టాలు, సమస్యలు, భవిష్యత్ సవాళ్లపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పాడి గణపతి రెడ్డి మాట్లాడుతూ మిల్లర్లకు ప్రభుత్వం వెంటనే అపాయింట్‌మెంట్ ఇచ్చి సమస్యలపై సమగ్రంగా చర్చించాలని కోరారు. విజిలెన్స్ దాడులు, కేసులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రికవరీ విధానాన్ని క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. అవుట్ టర్న్ రేషియో(ఓటీఆర్) టెస్ట్ మిల్లింగ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. టెస్ట్ మిల్లింగ్‌లో ఎంత అవుట్ టర్న్ వస్తుందో దాని ఆధారంగా బియ్యం సరఫరా, లెక్కలు ఉండేలా ఒప్పందాన్ని తీసుకురావాలన్నారు. ఖరీఫ్ వడ్లను రా రైస్ మిల్లులకు, రబీ వడ్లను బాయిల్డ్ రైస్ మిల్లులకు కేటాయించాలని కోరారు. ఈ నెల 6న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తామని, సమస్యలు పరిష్కరించని పక్షంలో 11న రైస్ మిల్లులు బంద్ చేస్తామని ప్రకటించారు.
