సైదాబాద్ ఫ్లైఓవర్ కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి..సీఎం రేవంత్ కు జాజుల లేఖ

సైదాబాద్ ఫ్లైఓవర్ కు సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలి..సీఎం రేవంత్ కు జాజుల లేఖ

హైదరాబాద్, వెలుగు: సైదాబాద్ ఫ్లైఓవర్‌కు స్వాతంత్ర్య సమరయోధురాలు, తొలి మహిళా మంత్రి సంగం లక్ష్మీబాయి పేరు పెట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. బాలికల విద్యావ్యాప్తికి విశేషంగా కృషిచేసిన సంగం లక్ష్మీబాయి గొప్ప మహానీయురాలని కొనియాడారు. ఇందిరాగాంధీ కంటే ముందే పార్లమెంట్‌లో అడుగుపెట్టిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారని, బాలికల విద్యవ్యాప్తికి తన సొంత ఆస్తిలోని 60 ఎకరాల్లో విద్యాసంస్థలను నెలకొల్పారని గుర్తుచేశారు.

'ఇందిరా సేవా సదన్' సంస్థను ఏర్పాటు చేసి జీవితాంతం మహిళల విద్య, ఉపాధి సాధికారతకు ఆమె పాటుపడ్డారని తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేట మూసీ ఫ్లైఓవర్ ప్రారంభం సందర్భంగా.. ఆల్వాల్ టిమ్స్‌కు మాజీ సీఎం అంజయ్య, ఎల్బీనగర్ టిమ్స్‌కు కొండా లక్ష్మణ్ బాపూజీ, వరంగల్ టిమ్స్‌కు జయశంకర్ పేర్లు పెడతామని ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో మహాత్మా జ్యోతిబా పూలే, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలను ఏర్పాటు చేయడం, ఉమెన్స్ యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం వంటి నిర్ణయాలు హర్షించదగ్గ విషయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.