దేశంలో ట్రాన్స్‌పోర్ట్ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతోంది. ప్రైవేట్ బైక్‌లను టాక్సీలుగా మార్చడం ద్వారా కోట్ల మందికి ఉపాధి కల్పించవచ్చని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అభిప్రాయపడ్డారు. మహారాష్ట్రలో 'సురక్ష' కార్యక్రమ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ.. ప్రైవేట్ టూవీలర్ల ద్వారా ప్రయాణికులను చేరవేసే విధానాన్ని రాష్ట్రాలు ఆమోదించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రతిపాదన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని మోడీ సర్కార్ భావిస్తోంది.
ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యం..
ప్రైవేట్ టూ-వీలర్ ఓనర్స్ తమ మోటార్ సైకిళ్లు, స్కూటర్లను ప్యాసింజర్ రైడ్స్ కోసం ఉపయోగించుకోవడానికి అనుమతించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాష్ట్రాలను కోరారు. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 8 కోట్ల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. కేంద్రం ఇప్పటికే దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. రవాణా రంగం పూర్తిగా రాష్ట్ర జాబితాలో ఉండటంతో ఫైనల్ నిర్ణయం ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేశారు.
మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ - 2025
ప్రైవేట్ బైక్‌లను టాక్సీలుగా నడిపేందుకు వీలుగా 'మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్ - 2025' కింద కేంద్రం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించింది. నాన్-ట్రాన్స్పోర్ట్ మోటార్ సైకిళ్లను ప్రయాణాల కోసం అగ్రిగేటర్లు ఉపయోగించుకోవడానికి ఈ మార్గదర్శకాలు అవకాశం కల్పిస్తున్నాయి. అయితే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సొంత నిబంధనలను విధించుకునే వెసులుబాటును, ఫీజులు వసూలు చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే కట్టబెట్టాయి.
రాష్ట్రాల వారీగా భిన్న పరిస్థితులు..
ఈ రూల్స్ అమలు విషయంలో వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. కర్ణాటకలో బైక్ ట్యాక్సీల అనుమతిపై న్యాయపరమైన చిక్కులు కొనసాగుతుండగా, ప్రయాణికుల సేఫ్టీ, మహిళల రక్షణ వంటి కారణాలతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మరోవైపు, మహారాష్ట్ర ప్రభుత్వం 2025లోనే స్వయంగా బైక్-టాక్సీ రూల్స్ నోటిఫై చేసింది. ఇందులో ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటర్లకు కూడా అనుమతులు ఇస్తూ పర్మిట్లు, అగ్రిగేటర్ల విధివిధానాలను స్పష్టంగా పొందుపరిచింది.
బైక్ ట్యాక్సీల అంశంతో పాటు దేశంలో రోడ్డు భద్రతను మెరుగుపరిచేందుకు మరో కీలక చర్యకు కేంద్రం సిద్ధమవుతోంది. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారికి నెగిటివ్ పాయింట్ల విధానాన్ని తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో జాతీయ రహదారులు, మైనింగ్ కార్మికుల కోసం ఉచిత వైద్య పరీక్షలు అందించే 'సురక్ష' పైలట్ ప్రాజెక్టును నాగ్పూర్-కాంపటీ మార్గంలో ప్రారంభించారు. ఈ నూతన విధానాలతో రోడ్ సేఫ్టీ మరింత మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు.
