US Open Birds: యుఎస్ ఓపెన్ 2026 రెండో రౌండ్ మ్యాచ్‌లో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. లూయిస్ ఆర్మ్‌స్ట్రాంగ్ స్టేడియంలో మాజీ ఛాంపియన్ డేనియల్ మెద్వెదేవ్, అమెరికా వైల్డ్‌కార్డ్ ప్లేయర్ సెబాస్టియన్ గోర్జ్నీల మధ్య పోరు జరుగుతుండగా రెండు పక్షులు అనూహ్యంగా నెట్‌పై వచ్చి వాలాయి. రెండో సెట్ మధ్యలో రాలీ కొనసాగుతుండగా, ఇద్దరు ఆటగాళ్లు హోరాహోరీగా షాట్లు కొడుతున్నా ఆ పక్షులు మాత్రం నెట్‌పై నుంచి కదలకుండా అలాగే ఉండిపోవడం స్టేడియంలోని అభిమానులతో పాటు ప్లేయర్స్ ను ఆశ్చర్యపరిచింది.
పాయింట్ రీప్లే ఇచ్చి షాక్ ఇచ్చిన అంపైర్:
రాలీ కొనసాగుతున్న సమయంలో మెద్వెదేవ్ కొట్టిన ఫోర్‌హ్యాండ్ షాట్‌కు ఒక పక్షి పైకి ఎగరడంతో, చైర్ అంపైర్ టిమో జాన్సన్ వెంటనే మ్యాచ్‌ను నిలిపివేసి ఆ పాయింట్‌ను మళ్లీ రీప్లే ఆడాల్సిందిగా ఆదేశించాడు. కానీ పక్షులు వాలిన వెంటనే ఆటను ఆపకుండా, తాను విన్నింగ్ షాట్ కొట్టే సమయానికి మ్యాచ్ ఆపి పాయింట్ రద్దు చేయడంపై మెద్వెదేవ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంపైర్ నిర్ణయాన్ని తప్పుపడుతూ తన కెరీర్‌లోనే ఇది అత్యంత విడ్డూరమైన నిర్ణయాల్లో ఒకటని మెద్వెదేవ్ మైదానంలోనే సీరియస్ అయ్యాడు.
ఫోకస్ కోల్పోకుండా మూడో రౌండ్‌కు దూసుకెళ్లిన మెద్వెదేవ్:
ఈ విచిత్రమైన అంతరాయం కొంత గందరగోళం సృష్టించినప్పటికీ, 2021 యుఎస్ ఓపెన్ ఛాంపియన్ మెద్వెదేవ్ తన ఏకాగ్రతను ఏమాత్రం కోల్పోలేదు. అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ 14 ఏస్‌లతో విజృంభించి 6–1, 6–3, 7–5 తేడాతో గోర్జ్నీని వరస సెట్లలో చిత్తు చేశాడు. ఈ ఘన విజయంతో రష్యన్ స్టార్ ఆటగాడు టోర్నీలో సునాయాసంగా మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టాడు.
కెరీర్‌లోనే అత్యంత వింతైన ఘటనల్లో ఒకటన్న రష్యన్ స్టార్:
మ్యాచ్ ముగిసిన అనంతరం మెద్వెదేవ్ మాట్లాడూతూ ఈ వింత అనుభవంపై స్పందించాడు. తన యుఎస్ ఓపెన్ కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత విచిత్రమైన టాప్-5 ఘట్టాలలో ఇది ఒకటి అని పేర్కొన్నాడు. పక్షులు వాలగానే అంపైర్ వెంటనే ఆటను ఆపుతాడని భావించానని, కానీ దాదాపు 45 సెకన్ల పాటు రాలీ ఆడించి చివరి క్షణంలో పాయింట్ రద్దు చేయడం వింతగా అనిపించిందని వ్యాఖ్యానించాడు.
#DaniilMedvedev really reported the sparrow to the umpire 😭#USOpen 2026 👉 LIVE NOW on Star Sports and JioHotstar! pic.twitter.com/Sc1K7P4KFC
— Star Sports (@StarSportsIndia) September 2, 2026
