- 21న హాజరుకావాలని సమన్లు జారీ చేసిన డెబిట్రికవరీ ట్రిబ్యునల్
- సభ్యుల్లో ఆందోళన
యాదాద్రి, వెలుగు : యదాద్రి జిల్లాలో ఫేక్ సంఘాల లోన్లపై మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆర్పీలు ఇతరుల ఆధార్ కార్డులతో 38 ఫేక్ మహిళా సంఘాలను సృష్టించి, భువనగిరి కెనరా బ్యాంకు ద్వారా 2022 నుంచి 2025 వరకు రూ. 7.99 కోట్ల రుణాలు డ్రా చేసి సొంతానికి వాడుకోవడం వివాదాస్పదంగా మారింది. తమకు ఎలాంటి సంబంధం లేదని బాధితులు మొరపెట్టుకున్నప్పటికీ, బ్యాంకర్లు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ ను ఆశ్రయించడంతో ట్రిబ్యునల్ సంబంధిత సభ్యులకు సమన్లు జారీ చేసింది. ఈ నెల 21న ఆధారాలతో సహా ట్రిబ్యునల్ ముందు హాజరై లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని, లేకపోతే బ్యాంక్‌కు అనుకూలంగా ఏకపక్ష తీర్పు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
లోన్ పొందినట్లు పేర్కొన్న సభ్యులు తమ ఆస్తుల వివరాలను అందించాలని, వాటిని విక్రయించడం.. లేదా తనఖా పెట్టడం లాంటివి చేయరాదని హెచ్చరించడంతో బాధితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే మోసపోయామని ఆవేదన చెందుతున్న బాధితులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు, తాజాగా యాదాద్రి అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావును ఆశ్రయించి తమ గోడును వెళ్లబోసుకున్నారు. స్పందించిన అడిషనల్ కలెక్టర్ ఈ వారం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని బాధితులకు భరోసా ఇచ్చారు.
