యాదాద్రి, వెలుగు : విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని యాదాద్రి కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. బుధవారం భువనగిరి మండలం అనంతారం గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఆయన సందర్శించారు.
పాఠశాలలో విద్యాబోధన, భోజనం నాణ్యత, పారిశుధ్యం,మౌలిక వసతులను పరిశీలించారు. విద్యార్థుల వారి భవిష్యత్ లక్ష్యాలు, పదో తరగతి పరీక్షల సన్నద్ధతపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు, ఐటీ, సాంకేతికత, కళలు వంటి వివిధ రంగాల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు. పాఠశాల నిర్వహణ, విద్యాబోధనపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధికారి మాధవి, పాఠశాల ప్రిన్సిపాల్ స్వప్న జెల్ల ఉన్నారు.
