మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్.. ఇవాళ (సెప్టెంబర్ 03) రైతు ధర్నాకు కేటీఆర్

మిర్యాలగూడలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫ్లెక్సీ వార్.. ఇవాళ (సెప్టెంబర్ 03)  రైతు ధర్నాకు కేటీఆర్

కాంగ్రెస్ పాలనను విమర్శిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు
    పోటీగా బీఆర్ఎస్ అమలు చేయని హామీలపై కాంగ్రెస్​ ఫ్లెక్సీల ఏర్పాటు

నల్గొండ, వెలుగు : నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీల మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ లీడర్లు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనికి పోటీగా, కేటీఆర్ చేపట్టనున్న రైతు సభకు వ్యతిరేకంగా, పదేండ్ల బీఆర్ఎస్ పాలనను విమర్శిస్తూ కాంగ్రెస్ నాయకులు సైతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, రైతు సభకు వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధం కావడంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.

కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై గులాబీ గురి

ఈ నెల 3న కేటీఆర్ రాకను పురస్కరించుకుని బీఆర్ఎస్ శ్రేణులు మిర్యాలగూడలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినందున ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందంటూ గులాబీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు. రైతు రుణమాఫీ సగం మందికే అయిందని, మిగతా హామీల ఊసే లేదంటూ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలన్నింటినీ ఫ్లెక్సీలతో నింపేశారు.

కాంగ్రెస్ రిటర్న్ కౌంటర్

బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కాంగ్రెస్ నేతలు సైతం అదే స్థాయిలో స్పందించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కారంటూ కౌంటర్ ఫ్లెక్సీలను సిద్ధం చేశాయి. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, నిరుద్యోగ భృతి వంటి పథకాల అమలులో బీఆర్ ఎస్ విఫలమైందంటూ గులాబీ ఫ్లెక్సీలకు దీటుగా కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెలిశాయి. 

భారీ బందోబస్తు

రైతు, నీటి సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం మిర్యాలగూడలో తలపెట్టిన రైతు ధర్నాకు కేటీఆర్ తో పాటు రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరుకానున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. పట్టణంలోని ముఖ్య కూడళ్ల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.