వరంగల్, వెలుగు: ప్రజలు ఓట్లేసి గెలిపించినా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని, ప్రజల చేతిలో ఓటమి పాలైన బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నేతలకు మాత్రం అధికార దాహం పోలేదని వరంగల్ ఎంపీ కడియం కావ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన బుధవారం గ్రేటర్ కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు.
ఎంపీ మాట్లాడుతూ పదేండ్ల కుటుంబ పాలన, అవినీతి, అక్రమాలతో ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్న బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేండ్లులో రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్తుందని, బీఆర్‌ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని సూచించారు.సమావేశంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయూబ్, మార్క విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
