వెంకటాపూర్ (రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని గొల్లల గుడికి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారత పురావస్తు సర్వేక్షణ విభాగం అధికారిక గెజిట్ విడుదల చేసింది.
గెజిట్ నోటిఫికేషన్ లో పొందుపరిచిన షెడ్యూల్ ప్రకారం గొల్లల గుడి పరిధిలోని 10 గుంటల విస్తీర్ణాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటిస్తూ భారత పురావస్తు సర్వేక్షణ పరిధిలోకి తీసుకుంది. ఈ మేరకు రక్షిత స్మారక చిహ్నం పరిమితులను ఖరారు చేస్తూ మ్యాప్ ను పొందుపరిచారు.
యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కు నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. తూర్పు ముఖం గల మండపం, చుట్టూ మూడు గర్భాలయాలతో త్రికుటాలాయంలా కనిపిస్తుంది. ఆలయ కూడ్యాలపై కనిపించే గుళ్లలో విష్ణుమూర్తి ,లక్ష్మీ, గణేశుడు, మహిషాసుర మర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తైన వేదికపై ఈ ఆలయం నిర్మితమైంది.
