దుబాయ్: తొలిసారిగా నిర్వహించనున్న విమెన్స్ చాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను ఇండియాకు కేటాయించినట్లు ఐసీసీ బుధవారం ప్రకటించింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో పరిపాలనాపరమైన ఇబ్బందులు తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరిగే ఈ టోర్నీ మ్యాచ్‌లను ముంబై, వడోదరలో నిర్వహిస్తారు. ప్రత్యామ్నాయ వేదికలుగా బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలను కూడా పరిశీలించినా.. చివరకు ఐసీసీ ఇండియా వైపు మొగ్గు చూపింది. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక ఈ టోర్నీలో తలపడతాయి.
జులై 6 వరకు ఐసీసీ విమెన్స్ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ఆరు జట్లు అర్హత సాధించాయి. రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో టాప్–2లో నిలిచిన జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి.
