సిద్దిపేట రూరల్, వెలుగు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ ల వద్ద చర్యలు తీసుకోవాలని సిద్దిపేట కలెక్టర్ కె.హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది ఆగస్టు వరకు జిల్లాలో 210 ప్రమాదాలు జరిగి 228 మంది మరణించారని, రాజీవ్ రహదారిపై వంటిమామిడి నుండి తోటపల్లి వరకు అధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీస్ శాఖ సూచించిన 28 ప్రధాన బ్లాక్ స్పాట్లలో హెచ్‌కేఆర్ రోడ్‌వేస్ వారితో కలిసి వెంటనే ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకుముందు నిర్వహించిన మాదకద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మాదకద్రవ్యాల వాడకం కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తుందని, విద్యార్థులు వాటికి అలవాటు పడకుండా వారి ప్రవర్తనపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అసాధారణంగా ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులను కోరారు.
