నిషేధిత భూములు పేదలకు పంచాలి..నర్సాపూర్ మహాధర్నాలో బీజేపీ ఎంపీలు

నిషేధిత భూములు పేదలకు పంచాలి..నర్సాపూర్  మహాధర్నాలో బీజేపీ ఎంపీలు

నర్సాపూర్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్  దొంగ, పోలీస్  ఆట ఆడుతూ ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బుధవారం మెదక్​ జిల్లా నర్సాపూర్  పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్  ఎదుట 22ఏ నిషేధిత భూములను పేదలకు పంచాలని డిమాండ్  చేస్తూ ధర్నాలో వారు పాల్గొని మాట్లాడారు. వేల కోట్ల విలువైన భూకబ్జాలు చేసిన బీఆర్ఎస్  నాయకుల్లో ఒకరినైనా అరెస్ట్​ చేశారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అయ్య, బిడ్డ, అల్లుడు చేసిన అక్రమాలు, సంపాదించిన ఆస్తులు వేలకోట్లలో ఉన్నాయని తెలిపారు. 

గతంలో బీఆర్ఎస్  దోచిన భూకబ్జాలపై ప్రశ్నించకుండా ఎమ్మెల్యే సునీత రెడ్డి ర్యాలీ నిర్వహించడం సిగ్గుచేటన్నారు. గత ప్రభుత్వం ధరణితో, ప్రస్తుత ప్రభుత్వం భూభారతితో భూములను దోచుకోవడం తప్ప పేదలకు చేసిందేమీ లేదన్నారు. పర్మిషన్లు ఇచ్చింది, కూలగొట్టింది.. కేసీఆర్  అని ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. వత్తాసు పలికిన అధికారులు కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్  ప్రభుత్వం అధికారులతో కుమ్మక్కై వేల ఎకరాలను కాజేసి అవినీతికి పాల్పడిందని తెలిపారు. 22ఏ భూములను పేదలకు పంచాలని డిమాండ్  చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్  మల్లేశ్ గౌడ్, నాయకులు రాజేందర్, రమేశ్ గౌడ్, సురేశ్, అంజా గౌడ్  పాల్గొన్నారు.