- డీఎన్ఏ పరీక్షలతో నిర్ధారించాలని ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని బాలల సంరక్షణ కేంద్రాలు, సంక్షేమం, పునరావాస వ్యవస్థల పనితీరుపై హైకోర్టు బుధవారం ఆరా తీసింది. అక్రమ దత్తతకు సంబంధించిన పిటిషన్పై విచారణ సందర్భంగా చట్టబద్ధమైన దత్తత నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. రెండు నెలల నుంచి మూడేళ్ల వయస్సున్న చిన్నారులు అక్రమ దత్తతకు గురైన కేసుల్లో, అసలైన తల్లిదండ్రులను గుర్తించడంలో పోలీసులు ఎందుకు విఫలమవుతున్నారని ప్రశ్నించింది.
దత్తత తీసుకున్నామని చెబుతున్న వ్యక్తులను సమగ్రంగా విచారించి తల్లిదండ్రులను గుర్తించాలని, అవసరమైతే డీఎన్ఏ ద్వారా నిర్ధారించాలని ఆదేశించింది. తల్లిదండ్రులను గుర్తించిన తర్వాతే ఆ దత్తత చట్టబద్ధమైనదా లేక పిల్లల కొనుగోలు, విక్రయాలు జరిగాయా అనేది తేలుతుందని కోర్టు పేర్కొంది. ఈ అంశంపై పూర్తి వివరాలతో వారంలోగా నివేదిక సమర్పించాలని హోంశాఖను ఆదేశించింది.
2023లో తాము దత్తత తీసుకున్న చిన్నారిని పోలీసులు స్వాధీనం చేసుకుని స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించడాన్ని సవాలు చేస్తూ నల్గొండ జిల్లా సూరారం మండలానికి చెందిన ఎం. వెంకన్న దంపతులు దాఖలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ విచారణకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రుతి ఓజా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి ఆన్లైన్లో హాజరయ్యారు. రాష్ట్రంలో బాల నేరస్తులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక గృహాలు, దత్తత కేంద్రాల వివరాలను ధర్మాసనం అడిగి తెలుసుకుంది. విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
