నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేరు: కొండా సురేఖ

నన్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేరు: కొండా సురేఖ

న్యూఢిల్లీ, వెలుగు: తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయలేరని, కేవలం ఎమ్మెల్యే పదవికి రాజీనామా మాత్రమే చేయాలని చెప్పగలరని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. అప్పుడు తాను ఏం చెప్పాలో, ఏం చేయాలో ఆలోచిస్తానని అన్నారు.  పార్టీలో ఇష్టమొచ్చినట్టు మాట్లాడేటోళ్లకు షోకాజ్ ఇవ్వాలంటే మొదట సీఎం రేవంత్ రెడ్డితోనే మొదలు పెట్టాలని వ్యాఖ్యానించారు. రాబోయే పదేండ్లు సీఎం తానే అని చెప్పుకోవడం పార్టీ లైన్ దాటడం కాదా? అని ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రేమో నేరుగా టికెట్లు ప్రకటించవచ్చా? కానీ, ఆయనకు నోటీసులు ఇవ్వరా? 119 అసెంబ్లీలకు కాకుండా ఒకటే టికెట్ ఎందుకు ప్రకటిస్తారు? అంటే, ఉద్దేశ పూర్వకంగా మమ్మల్ని రెచ్చగొట్టడానికే కదా?’’ అని అడిగారు. బుధవారం ఇందిరా భవన్‌‌లో ఆమె పార్టీ చీఫ్ ఖర్గే తో సమావేశం అయ్యారు. అనంతరం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసు, తనపై వచ్చిన ఫిర్యాదులు, కుమార్తె చేసిన వ్యాఖ్యలపై తనను బాధ్యురాలిని చేస్తున్నారని, వాటిపై ఖర్గేకు వివరణ ఇచ్చానని చెప్పారు.  రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌‌ను కూడా కలిసి తన వర్షన్‌‌ను వినిపించినట్టు సురేఖ తెలిపారు. ఖర్గే, మీనాక్షి ఇద్దరూ తన పట్ల సానుకూలంగా స్పందించారని తెలిపారు.  బీసీ మహిళా మంత్రిని కాబట్టే తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.  తనపై కుట్ర చేస్తున్న వారి పేర్లు తనకు తెలుసని చెప్పారు. తెలంగాణలోని పరిస్థితులు, తనపై జరుగుతున్న కుట్రపై సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌‌కు ఇప్పటికే సుదీర్ఘమైన మెయిల్ చేసినట్టు చెప్పారు. తన కుమార్తె వివాహం జరిగి ఇండిపెండెంట్‌‌గా జీవిస్తున్న వ్యక్తి అని, ఆమె తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు కలిగి ఉందని తెలిపారు. ‘‘నా కూతురు మాట్లాడిన దానికి నాకు షోకాజ్ ఇచ్చారు. ఆమెను అలా మాట్లాడొద్దని చెప్పే అధికారం నాకు లేదు” అని పేర్కొన్నారు.  ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడే ఆయన కొడుకు అర్వింద్‌‌ ఇష్టానుసారంగా మాట్లాడారని.. మరి అప్పుడు ఆయనకు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అని ప్రశ్నించారు. బీజేపీని, పార్టీ నాయకులను పరకాల ప్రభాకర్ తిడితే నిర్మలా సీతారామన్‌‌కు నోటీసులు ఇస్తారా?  అని మంత్రి సురేఖ నిలదీశారు.

చూస్తం..ఆలోచిస్తం అన్నరు

శంషాబాద్, వెలుగు: ఢిల్లీలో కాంగ్రెస్​ అధ్యక్షుడు ​ఖర్గే, రాష్ట్ర ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్‌‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ బుధవారం రాత్రి హైదరాబాద్​ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌‌లో మీడియాతో మాట్లాడారు.‘‘మీనాక్షి నటరాజన్‌‌ను, ఖర్గేను కలిశాను. నా ఆలోచన చెప్పాను. జరిగిన పరిణామాలు వివరించాను. వాళ్లు చూస్తం..ఆలోచిస్తం అని చెప్పారు” అని పేర్కొన్నారు. అధిష్టానం ఏం హామీ ఇచ్చిందని ప్రశ్నించగా..‘‘పార్టీలో డిస్కస్​ చేయాలి కదా.. వాళ్లిద్దరే డైరెక్ట్‌‌గా ఏం చెప్పలేరు కదా.. పార్టీలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారేమో’’ అని అన్నారు.