హైదరాబాద్, వెలుగు: మైనర్లకు ఈ-–సిగరెట్ల విక్రయిస్తున్న ముఠాపై తెలంగాణ ఈగల్ ఫోర్స్చర్యలు చేపట్టింది. బుధవారం రాయదుర్గంలోని పవ్వారోడ్డులో నలుగురు మైనర్లు ఈ-సిగరెట్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి రెండు ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు తమకు ఈ-సిగరెట్లు అమ్మినట్లు విచారణలో మైనర్లు వెల్లడించారు. ఈ సమాచారం ఆధారంగా ముషీరాబాద్కు చెందిన అర్సలాన్ షరీఫ్ ను అదుపులోకి తీసుకుని.. అతడి నుంచి 11 ఈ-సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు.
2 మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. అర్సలాన్.. ఆన్లైన్ క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా వెబ్సైట్ల నుంచి ఈ-సిగరెట్లు తెప్పించినట్లు వెల్లడైంది. కనీసం 5 ఈ -సిగరెట్ల చొప్పున ఆర్డర్ చేసేవాడని, ఒక్కోదానికి రూ.1,500దాకా చెల్లించేవాడని ఈగల్ ఫోర్స్ తెలిపింది. తన సహచరుడు ముదాసిర్ ముజాహిద్(21) ద్వారా ఇద్దరు మైనర్లకు ఒక్కో ఈ-సిగరెట్ను 2 వేలకు విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. అరెస్టు చేసిన అర్సలాన్ షరీఫ్, ముదాసిర్ ముజాహిద్తో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులను ఈగల్అధికారులు ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు.
