ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్కు ఘన నివాళి

ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల వ్యాప్తంగా వైఎస్సార్కు ఘన నివాళి

నెట్​వర్క్, వెలుగు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉమ్మడి నల్గొండ, మెదక్, మహబూబ్​నగర్​ జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహాలకు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్సించారు. నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, హుజూర్‌‌‌‌‌‌‌‌నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌లు దొంతగాని శ్రీనివాస్ గౌడ్, దండి లక్ష్మి, మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడారు. వెఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నిరుపేదల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయని కొనియాడారు. రైతులకు ఉచిత విద్యుత్, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్, ఆరోగ్యశ్రీ, 104, 108 అంబులెన్సులు, జలయజ్ఞం ద్వారా సాగునీటి ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు వంటి విప్లవాత్మక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడని స్మరించుకున్నారు. 

మరోవైపు చేర్యాల, మద్దూరు, దూల్మిట్ట మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు డి. శ్రీకాంత్, యం. మల్లేశం, గిరి కొండల్​రెడ్డి, బండి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వెఎస్సార్ వర్ధంతి నిర్వహించి భారీ బైక్ ర్యాలీలు చేపట్టారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికే ‘బాకీ కార్డుల’ నాటకం ఆడుతోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని హామీలను విజయవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.