- అసంపూర్తి పనులతో హైదరాబాద్, ఖమ్మం మెయిన్రోడ్లపై డేంజర్‌బెల్స్
- నిత్యం ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
- జనాలకు ప్రయోజనం దక్కని దాదాపు రూ.218 కోట్ల ప్రాజెక్టులు
వరంగల్, వెలుగు: గ్రేటర్ వరంగల్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జిల (ఆర్వోబీ) నిర్మాణాలు ఏండ్లు గడిచినా పూర్తికావడం లేదు. వరంగల్ ట్రైసిటీ నుంచి హైదరాబాద్, ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన మార్గాల్లో వరంగల్, కాజీపేట స్టేషన్ల పరిధిలో ఎనిమిది, తొమ్మిదేండ్ల కింద చేపట్టిన పలు ఆర్వోబీ పనులు ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. కాజీపేట ఫాతిమానగర్ ఆర్వోబీ, ఎన్‌ఐటీ మీదుగా కాజీపేట దర్గా నుంచి భట్టుపల్లి మార్గంలోని ఆర్వోబీ, హంటర్‌రోడ్ విమ్స్ కాలేజీ మీదుగా ఖమ్మం వెళ్లే మార్గంలోని ఆర్వోబీ ఒక్కటి కూడా పూర్తికాలేదు. గత ప్రభుత్వ హయాంలో నిధులు అందకపోవడంతో పనులు ఏండ్ల తరబడి నిలిచిపోయాయి. ఇప్పుడు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి.
హంటర్‌రోడ్ ఆర్వోబీ పనులకు తొమ్మిదేండ్లు..
ఉమ్మడి వరంగల్ నుంచి ఖమ్మం వెళ్లే ప్రధాన మార్గంలోని హంటర్‌రోడ్ విమ్స్ కాలేజీ వద్ద చేపట్టిన ఆర్వోబీ పనులు ఏండ్లుగా కొనసాగుతుండడంతో ఐరన్ తుప్పుపట్టింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటతో పాటు కరీంనగర్ వైపు నుంచి వచ్చే ప్రయాణికులు ఖమ్మం, విజయవాడ వెళ్లేందుకు ఈ మార్గాన్ని వినియోగిస్తారు. సుమారు 23 ఏండ్ల కింద నిర్మించిన హంటర్‌రోడ్ ఆర్వోబీ ప్రస్తుత వాహనాల రద్దీకి సరిపోకపోవడంతో 2017లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.78 కోట్లతో కొత్త ఆర్వోబీ చేపట్టింది. ఒకటి, రెండేండ్లలో బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేకపోవడంతో రైలు పట్టాలపై స్టీల్ గిడ్డర్ల ఏర్పాటు పనులు నిలిచిపోయాయి. రైల్వే శాఖ సహకారంతో చేపట్టాల్సిన పనుల విషయంలో జిల్లా అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. నిర్మాణ పనులు ఏండ్ల తరబడి నిలిచిపోవడంతో అక్కడ ఉంచిన ఇనుప రాడ్లు, ఇతర సామగ్రి తుప్పుపట్టాయి.
అడుగు దూరంలో ఆగిన ఫాతిమానగర్ ఆర్వోబీ
గ్రేటర్ వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రధాన మార్గంలోని కాజీపేట ఫాతిమానగర్ ఆర్వోబీ నిర్మాణం మూడేండ్లుగా నిలిచిపోయింది. కాజీపేట రైల్వే జంక్షన్‌కు వెళ్లే వారు, జనగామ, హైదరాబాద్ వైపు ప్రయాణించే వాహనాలు ఢిల్లీ వైపు నుంచి వచ్చే రైల్వే ట్రాక్‌ను దాటేందుకు ఫాతిమానగర్ బ్రిడ్జినే వినియోగించాలి. 1972-–74 మధ్య నిర్మించిన పాత ఆర్వోబీ ప్రస్తుత రద్దీకి సరిపోకపోవడంతో పాటు శిథిలావస్థకు చేరింది. దీంతో 2021లో రూ.72 కోట్లతో కొత్త ఆర్వోబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, ఇప్పటి వరకు పనులు పూర్తికాలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ సంస్థకు నిధులు అందకపోవడంతో పనులు నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.16 కోట్ల పెండింగ్ ఫండ్స్ఇప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఫాతిమానగర్ ఆర్వోబీ పనులు దక్కించుకున్న ‘బిలాయ్ ఉక్కు కంపెనీ’ దేశవ్యాప్తంగా మరో 12 ఆర్వోబీ పనులు దక్కించుకుంది. ఇక్కడ స్ట్రక్ రైట్ సంస్థతో కలిసి పనులు చేపడుతోంది. నిర్మాణ సామగ్రిని ఛత్తీస్‌గఢ్, బిహార్ ప్రాంతాల నుంచి సఫ్లై చేస్తున్నారు. రైల్వే పట్టాలకు ఇరువైపులా బ్రిడ్జి నిర్మాణం పూర్తికాగా, పట్టాలపై ఆర్క్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనికి సుమారు 20 ట్రక్కుల ఫ్రేములు, గిడ్డర్లు అవసరం. ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్ నుంచి 12 ట్రక్కుల సామగ్రి చేరింది. మరో రెండు ట్రక్కుల సామగ్రి రెండు, మూడు రోజుల్లో చేరనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. సామగ్రి మొత్తం చేరగానే రైల్వే శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ‘ట్రాఫిక్ బ్లాక్’ తీసుకొని పనులు పూర్తి చేయాల్సి ఉంది. పనుల్లో జాప్యం లేకుండా మిగిలిన ఆరు ట్రక్కుల సామగ్రిని కూడా త్వరగా రప్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఫాతిమానగర్ ఆర్వోబీ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది.
కాజీపేట దర్గా వద్ద పిల్లర్ల వరకే
గ్రేటర్ వరంగల్ నుంచి ఖమ్మం హైవేతో పాటు భట్టుపల్లి, కొండపర్తి తదితర గ్రామాలకు వెళ్లే ప్రధాన మార్గంలో కాజీపేటలోని హజరత్ బియాబానీ దర్గా వద్ద రైల్వే ట్రాక్ దాటాల్సి ఉంటుంది. ఆర్ఈసీ(ఎన్‌ఐటీ) పక్కనుంచి వెళ్లే ఈ మార్గంలో జనాభా, కాలనీలు పెరగడంతో వాహనాల రద్దీ తీవ్రంగా పెరిగింది. రైలు వెళ్లే సమయంలో రెండు నిమిషాలు గేటు వేశారంటే రెండువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో 2022లో ఆర్‌ఈసీ రోడ్డు మార్గంలో వెళ్లే వాహనాలు రైల్వే గేటు వద్దకు రాకుండానే ముందుకు సాగేలా రూ.68 కోట్లతో ఆర్వోబీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అయితే ఇప్పటివరకు సిటీ వైపు నుంచి రైల్వే పట్టాల వరకు మాత్రమే పిల్లర్ల నిర్మాణం పూర్తయింది. ట్రాక్ అవతలి వైపు మాత్రం అవసరమైన భూసేకరణ కూడా పూర్తికాలేదు. దీంతో నాలుగేండ్లుగా బ్రిడ్జి నిర్మాణానికి తీసుకొచ్చిన ఇనుము, సిమెంట్ తదితర నిర్మాణ సామగ్రి ఎండావానలకు పాడవుతోంది.
