హిమాలయాలకు పర్యాయపదాలు గ్లేసియర్లు లేదా హిమానీనదాలు. ఆధునిక మానవుడి ప్రమేయం, పర్వత భూగర్భంలో జరుగుతున్న కదలికల ఫలితంగా హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ ప్రతికూల మార్పులతో తీవ్రమైన విపత్తులు జరుగుతున్నాయి. పర్వతాలను కప్పిన మంచు వేగంగా కరుగుతోంది. గ్లేసియర్సు సన్నబడుతున్నాయి. హిమ సరస్సులు ఉబ్బిపోతున్నాయి. కొండచరియలు, మంచు చరియలు విరిగి, నదులు ఉప్పొంగి ఆకస్మిక వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా 28 ఆగస్టు 2026 రోజు నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన ఘోర భారీ వరదలు, మట్టి లేదా బురద ప్రవాహాలు ప్రపంచానికి సవాలు విసురుతున్నాయి. సుమారు 2,000 అడుగుల వెడల్పు ఉన్న ఎత్తైన హిమానీనదాల్లోని మంచు, రాళ్లు, మట్టి ఒక్కసారిగా 4,000 అడుగుల లోతున ఉన్న లోయలో కూలిపోయి, కొన్ని నిమిషాల్లోనే భారీ విధ్వంసంతో కూడిన అపార ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చాయి.
ఈ భారీ మట్టితో కూడిన బురద ప్రవాహం ‘భోటే కోసి’ నది లోయలోకి దూసుకు వచ్చి గ్రామాలు, రహదారులు, వంతెనలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, వందలాది లెక్కించడం సాధ్యంకాని విధంగా మనుషులు, పశువులను క్షణాల్లో మింగేశాయి. తొలుత భూకంపమే కారణం కావచ్చని అనుమానించారు. గ్లేసియర్లు కూలిపోవడం, మంచు-రాళ్ల ప్రవాహం పైనుంచి కిందికి ఒక్కసారిగా ఐదు నుంచి ఆరు వేల మీటర్ల ఎత్తు నుంచి కిందకు కూలడంతో లోయలోని నదీ ప్రవాహం కూడా కలిసి ఈ అతి ప్రమాదకర విపత్తుకు కారణం అయ్యింది. నేడు ఆ ప్రదేశంలో కారు చీకట్లు, బురద గుట్టలు, ప్రజల హాహాకారాలు మాత్రమే మిగిలాయి.
హిమపాత విపత్తులు కొత్తేమీ కాదు
ఇలాంటి ప్రకృతి హిమపాత విపత్తులు గతంలో కూడా జరిగాయి. 2021లో ఉత్తరాఖండ్‌లోకి చమోలి ప్రాంతంలో మంచు-రాళ్ల ప్రవాహ వరదలతో 200లకు పైగా ప్రాణాలు కోల్పోయారు. 2023లో సిక్కిం సౌత్ లోనాక్ సరస్సు ఉప్పొంగి భారీ నష్టాలను మిగిల్చింది. 2024లో నేపాల్‌లో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడడంతో వందల ప్రాణాలు గాల్లో కలిసాయి. అదే ఏడాది నేపాల్‌లోని థామే ప్రాంతంలో ‘గ్లేసియర్ అవుట్-బరస్ట్’ వరదలతో భారీ ఆస్తి ప్రాణ నష్టం జరిగింది. 2025లో నేపాల్-, టిబెట్ సరిహద్దులో కూడా ఇలాంటి విపత్తుతో భారీ విధ్వంసం చవిచూశాం. ఈ వరుస విపత్తులను గమనిస్తూ, విశ్లేషిస్తూ హిమాలయాల్లో గ్లేసియర్లు, హిమ సరస్సుల పరిస్థితులను ముందుగానే గుర్తించే ప్రయత్నం జరగాలని మొన్నటి ప్రళయం చెపుతోంది.
గ్లేసియర్ లేక్ ఔట్-బరస్ట్ ఫ్లడ్స్
ఈ ప్రళయ విధ్వంసాలకు ప్రధాన కారణంలో ఒకటి వాతావరణ ప్రతికూల మార్పులు అని నిర్థారిస్తున్నారు. గ్లేసియర్ల ఉష్ణోగ్రతలు పెరగడంతో అవి సాధారణం కన్నా వేగంగా కరుగుతున్నాయి. ఇవి కరగడంతో కొత్త కొత్త సరస్సులు చుట్టుపక్కల ఏర్పడుతున్నాయి. ఈ సరస్సులను మంచు, రాళ్లు, మట్టితో కూడిన బలహీన అడ్డుకట్టలు నిలిపి ఉంచుతున్నాయి. ఈ అడ్డుకట్ట తెగిన సందర్భంగా ఒకేసారి ఎత్తు నుంచి భారీ నీటి, రాళ్లతో కూడిన బురద వరదలు దిగువ ప్రాంతాలకు వాయువేగంతో దూసుకువచ్చి ‘గ్లేసియర్ లేక్ ఔట్-బరస్ట్ ఫ్లడ్స్(జిఎల్ఒఎఫ్)’ ఏర్పడుతున్నాయి. ప్రమాదకర హిమ సరస్సుల సమీపాన, వాటి దిగువ లోయల్లో నివసించే లక్షలాది ప్రజలు ఈ ముప్పులో మునిగి సర్వం కోల్పోతున్నారు. నేడు నేపాల్‌లో జరిగిన విపత్తుకు కారణమైన హిమపర్వతాలు 5,600 మీటర్ల ఎత్తు నుంచి కూలి ఈ విపత్తు సంభవించిందని తెలుస్తున్నది. గ్లేసియర్లు లేదా హిమ సరస్సులు కూలిన ఘటనతో ఇరుకైన పర్వత లోయలు, వంతెనలు, రహదారులు, జల విద్యుత్తు ప్రాజెక్టులు, ఉపనదులు, నదులు, నదీ తీర ఆవాసాలు కొట్టుకుపోయి దిగువ మైదాన
ప్రాంతాలకు చేరుతున్నాయి.
హిమాలయ సరిహద్దు దేశాలకు తీవ్ర హెచ్చరిక
ఇలాంటి ప్రకృతి ప్రళయాలు భారతదేశ హిమాలయ ప్రాంతాలైన సిక్కిం, అరుణాచల్, ఉత్తరాఖండ్, హిమాచల్, జె అండ్ కె, లడఖ్, అస్సాం ప్రాంతాల్లో కూడా జరిగే అవకాశాలు లేకపోలేదు. భారత హిమాలయ రాష్ట్రాల్లో అనేక పట్టణాలు, గ్రామాలు, రహదారులు, జల విద్యుత్ కేంద్రాలు లోయలకు అతి సమీపంలో ఉండడం గమనార్హం. పర్యాటకం పెరగడం, రహదారుల విస్తరణలు, కొండ ప్రాంతాల్లో నిర్మాణాలు పెరగడం, పర్యావరణ విచ్ఛిన్న జీవనశైలి పాటించడంతో పెను ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఇలాంటి విపత్తులను పూర్తిగా అడ్డుకోవడం అసాధ్యమే అయినా, నష్టాలను గణనీయంగా తగ్గించేలా చర్యలు అవసరం. ప్రమాదకర హిమ సరస్సులను ఉపగ్రహాలు, డ్రోన్లు, రిమోట్ సెన్సింగ్‌ల ద్వారా నిరంతరం నిఘా పెంచాలి. సరస్సుల్లో నీటి మట్టం కొలవడం, మంచు గోడల స్థిరత్వాలను అంచనా వేసే ఎర్లీ వార్నింగ్ టెక్నాలజీని తీసుకురావాలి.
విపత్తులకు దేశ సరిహద్దులు ఉండవు. ఒక దేశంలో గ్లేసియర్ కదలిక లేదా వరదలు మరో దేశంలోకి జారవచ్చు, ఆ ప్రాంతాల నదీ ప్రవాహాలను ప్రభావితం చేయవచ్చు. ఇందుకుగాను హిమాలయ ప్రాంత చైనా, భారత్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్, టిబెట్ ప్రాంతం లాంటి దేశాల మధ్య సమాచార వినిమయ సమన్వయం పెరగాలి. వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా నిలుస్తున్న గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను తగ్గించాలి. పర్వత ప్రాంతాల సహజ వ్యవస్థను కాపాడుకోవాలి. విపత్తు ముంచెత్తిన తర్వాత స్పందించడం కన్నా అది రాకముందే గుర్తించే వ్యవస్థలు కావాలి. ప్రజలకు విపత్తు నిర్వహణ పట్ల అవగాహన కల్పించాలి. లోయ ప్రాంతాల్లో గుహ, రోడ్లు, వంతెన, ప్రాజెక్టుల నిర్మాణాలను నియంత్రించాలి. హిమాలయ దేశాల మధ్య సమాచార వితరణ నిరంతరం జరగాలి.
- డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచన 700 పదాలకు మించరాదు.
