హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన అబద్ధాలు, మోసాలతో సాగిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. 6 గ్యారంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ప్రజలను అడుగడుగునా మోసం చేసిందని బుధవారం ఓ ప్రకటనలో మండిపడ్డారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి 12 ఏండ్లుగా తెలంగాణ సమాజాన్ని చీటింగ్ చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన ‘420 ప్రభుత్వం’ అని విమర్శించారు.
సర్కార్ వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఉద్యోగులు, టీచర్లు తమ హక్కుల కోసం రోడ్డెక్కడం బాధాకరమన్నారు. రైతు భరోసా కిస్తీలు ఎగ్గొట్టారని, పది పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి రైతులకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాష్ట్రాన్ని రూ.13 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం.. తన వైఫల్యాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
