పంజాగుట్ట, వెలుగు: పంజాగుట్ట పోలీస్టేషన్ పరిధిలో ప్రాపర్టీ కొనుగోలు పేరుతో రూ.13.57 లక్షలు తీసుకుని మోసం చేసిన నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎస్ మక్తాకు చెందిన హరికృష్ణతో మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌గా పనిచేసే మోతూరి వినోద్‌కుమార్ పరిచయం పెంచుకున్నాడు. సోమాజీగూడలోని ఓ ఫార్మా డిస్ట్రిబ్యూషన్ సంస్థతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపాడు. రాజ్‌భవన్ రోడ్డులోని ఓ ఆస్తి బ్యాంకు వేలంలో ఉందని, దాన్ని ఇద్దరం కలిసి కొనుగోలు చేయవచ్చని నమ్మబలికాడు.
ఆస్తి యజమానిగా సుంకోజు మహేందర్‌ను పరిచయం చేసి, హరికృష్ణ నుంచి డీడీలు, చెక్కులు, యూపీఐల ద్వారా విడతల వారీగా మొత్తం రూ.13,57,400 చెల్లించేలా చేశాడు. అనంతరం రిజిస్ట్రేషన్‌ను వివిధ కారణాలతో వాయిదా వేస్తూ వచ్చారు. డబ్బులు తిరిగి ఇవ్వమంటే ఇవ్వకపోగా.. బెదిరింపులకు పాల్పడ్డారు. ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకున్నారు. వినోద్‌కుమార్, అతనికి సహకరించిన సుంకోజు మహేందర్, రవీందర్‌రెడ్డి, సాయిపై బాధితుడు పంజాగుట్ట పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
