- కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాగా రాష్ట్రాన్ని ఇస్తే.. రేవంత్ కుప్పకూల్చిండు: హరీశ్‌రావు
- కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై చార్జిషీట్
హైదరాబాద్, వెలుగు: ఆరు గ్యారంటీల పేరుతో బాండు పేపర్లు రాసిచ్చి.. వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని ప్రజలను కాంగ్రెస్ నమ్మబలికిందని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పేర్కొన్నారు. వెయ్యి రోజులు గడుస్తున్నా ఆ హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ఒక కొత్త రాష్ట్రాన్ని తన అపార అనుభవంతో, ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా ఎంతో కష్టపడి అద్భుతంగా నిర్మించారని తెలిపారు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బుధవారం తెలంగాణ భవన్‌లో చార్జిషీట్ విడుదల చేసిన సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు.
అన్ని రంగాల్లోనూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా, తలమానికంగా కేసీఆర్ తయారు చేశారని చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అద్భుతమైన వ్యవస్థలన్నీ ఒక్కొక్కటిగా కుప్పకూలిపోతున్నాయని అన్నారు. విద్య, వైద్యం, విద్యుత్, తాగునీరు, శాంతి భద్రతలు.. ఇలా ప్రతీ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలాగా రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పజెప్తే.. దాన్ని పూర్తిగా నాశనం చేసి కుప్పకూల్చారన్నారు.
రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పడం ప్రజా పాలనా?
సాదా బైనామా క్రమబద్ధీకరణ పేరుతో రైతుల దగ్గర వేలాది రూపాయలు వసూలు చేసి.. పాస్ పుస్తకాలు ఇవ్వకుండా నెలల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం ఏ రకమైన ప్రజాపాలన అని హరీశ్‌రావు ప్రశ్నించారు. మక్తల్ రైతులు ఆయన్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ‘ఎక్స్’లో స్పందించారు. సొంత భూమి కోసం మక్తల్ నియోజకవర్గ రైతులు పడుతున్న అవస్థలే.. ఈ కాంగ్రెస్ సర్కార్ చేతకానితనానికి, నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.
రైతుల భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కావడం లేదని ఆరోపించారు. భూ భారతి పోర్టల్‌లో టెక్నికల్ ఇష్యూ ఉందని, పైనుంచి ఆదేశాలు రావడం లేదని చెప్పి ఎమ్వార్వో, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ రైతులను తిప్పుతున్నారన్నారు. కాగా, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ, ఏరియర్స్ అందడం లేదని హరీశ్ అన్నారు. 30–40 ఏండ్ల పాటు ఆర్టీసీకి సేవ చేసిన సుమారు 18 వేల మంది విశ్రాంత ఉద్యోగులకు నేటికీ రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం దారుణమని పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటికే 400 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం కలచివేస్తోందన్నారు.
