చైనా మాస్టన్స్ సూపర్–750 టోర్నీ : లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే..

 చైనా మాస్టన్స్ సూపర్–750 టోర్నీ : లక్ష్య సేన్ తొలి రౌండ్లోనే..

షెన్‌‌జెన్‌‌: ఇండియా స్టార్‌‌ షట్లర్‌‌ లక్ష్య సేన్‌‌.. చైనా మాస్టర్స్‌‌ సూపర్‌‌–750 టోర్నీలో నిరాశపర్చాడు. బుధవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ తొలి రౌండ్‌‌లో లక్ష్య 14–21, 7–21తో విక్టర్‌‌ లాయ్‌‌ (కెనడా) చేతిలో ఓడాడు. ఫలితంగా కెనడా ప్లేయర్‌‌ చేతిలో లక్ష్య ఓడటం ఇది మూడోసారి. ఈ ఏడాది జరిగిన ఆల్‌‌ ఇంగ్లండ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో మాత్రమే విజయం సాధించాడు.

38 నిమిషాల మ్యాచ్‌‌లో లక్ష్య ఎండ్‌‌ గేమ్‌‌లో తడబడ్డాడు. తొలి గేమ్‌‌లో 8–8 స్కోరు తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోయాడు. రెండో గేమ్‌‌లో ప్రత్యర్థి జోరుకు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాడు. బలమైన స్మాష్‌‌లు, ర్యాలీలతో రెచ్చిపోయిన లాయ్‌‌ స్కోరు 2–2 తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు.

మరో మ్యాచ్‌‌లో కిడాంబి శ్రీకాంత్‌‌ 21–16, 21–15తో చి యు జెన్‌‌ (చైనీస్‌‌తైపీ)పై గెలిచి రెండో రౌండ్‌‌లోకి ప్రవేశించాడు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌లో తన్వీ శర్మ 21–16, 21–17తో అమెలీ షుల్జ్‌‌ (డెన్మార్క్‌‌)పై గెలిచింది. మెన్స్‌‌ డబుల్స్‌‌లో సాత్విక్‌‌–చిరాగ్‌‌ షెట్టి 21–11, 21–16తో జునైద్‌‌ ఆరిఫ్‌‌–కాంగ్‌‌ ఖాయ్‌‌ జింగ్‌‌ (మలేసియా)పై, మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో ధ్రువ్‌‌ కపిల–తానీషా క్రాస్టో 21–8, 21–9తో టోనాకార్న్‌‌ సెహాంగ్‌‌–టోనిచా సెహాంగ్‌‌ (థాయ్‌‌లాండ్‌‌)పై గెలిచారు. దేవిక సిహాగ్‌‌ 18–21, 15–21తో కలోయనా నల్బంటోవా (బల్గేరియా) చేతిలో, మిక్స్‌‌డ్‌‌లో రోహన్‌‌ కపూర్‌‌–రుత్విక శివాని 16–21, 18–21తో వుయ్‌‌ గువాన్‌‌ జున్‌‌–లీ చియా సిన్‌‌ (చైనీస్‌‌తైపీ) చేతిలో ఓడారు.