కుత్బుల్లాపూర్, వెలుగు: అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 10 మంది నకిలీ డాక్టర్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్ డీసీపీ కోటిరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. మేడ్చల్, సంగారెడ్డి, పటాన్చెరువు, అర్సీపురం, జగద్గిరిగుట్ట, సూరారం, బాచుపల్లి తదిరప్రాంతాల్లో అర్హత లేకుండా వైద్యం చేస్తున్నారనే సమాచారంతో ఎస్వోటీ పోలీసులు జిల్లా మెడికల్ ఆఫీసర్స్‌తో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఇంటర్, టెన్త్ చదివిన వారు ఆర్ఎంపీలుగా చెలామణీ అవుతూ ఏకంగా క్లినిక్‌లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
వి.బుచ్చయ్య, సుధాకర్‌చారి, డి.అంజాగౌడ్, రమావత్ ప్రకాష్, మేకల అక్షయ్‌కుమార్, కె.నారాయణ, జి.ప్రహ్లాద్, కొనపాల బుచ్చయ్యబాబు, ఎస్. శ్రీనివాస్‌రావు, పి.గంగారాంను అరెస్ట్ చేశారు. వారి వద్ద వైద్యానికి ఉపయోగించే సామగ్రి, గడువు మగిసిన మందులు, సిరంజీలు, సెలైన్ బాటిళ్లుస్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
