హైదరాబాద్, వెలుగు: పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ, డీఏలు సాధించడమే లక్ష్యంగా ఉద్యమిస్తామని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఉద్యోగుల పక్షాన పోరాడుతామన్నారు. ఈనెల 6న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించనున్న ఉద్యోగుల సంకల్ప సభ పోస్టర్‌ను బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్లను కూడా తక్షణమే క్లియర్ చేయాలని కోరారు. ప్రతి నెల రూ.2 వేల కోట్ల చొప్పున నిధులు విడుదల చేసి బకాయిలను క్లియర్ చేయాలని సూచించారు.
2004కు ముందు నోటిఫికేషన్ వచ్చి.. ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్ ప్రయోజనం కల్పించాలని కోరారు. జీవో 317తో స్థానికత కోల్పోయిన ఉద్యోగులు, టీచర్ల సమస్యలను పరిష్కరించడంతో పాటు పదోన్నతులు, బదిలీలు చేపట్టాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సంకల్ప సభను విజయవంతం చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నామని లచ్చిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు నిర్మల, ఎస్. రాములు, బాణాల రాంరెడ్డి, కుమారస్వామి, దర్శన్ గౌడ్, మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
