- ఆన్ డ్యూటీలో ఉన్న నలుగురు జవాన్లను విచారిస్తున్న పోలీసులు
- ఆయుధాలు తరలించినట్లు లభించని ఆధారాలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని మద్రాస్ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో పోలీసులు దర్యాప్తును స్పీడప్ చేశారు. దేశ భద్రతకు సంబంధించిన అంశం కావడంతో అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. దర్యాప్తులో భాగంగా ఆయుధాలు అదృశ్యమైన ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ సేకరించేందుకు ప్రయత్నించగా, కొత్త విషయం బయటకు వచ్చింది. ఆదివారం ఉదయం నుంచి ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలు పలుమార్లు స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్మీ ఇంటెలిజెన్స్, మేడ్చల్ మల్కాజ్‌గిరి పోలీసులు సహా10 టీమ్స్‌తో దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు, ఆ తర్వాత కూడా ఆన్‌డ్యూటీలో ఉన్న నలుగురు జవాన్లను ప్రశ్నించినట్లు సమాచారం.
లభించని ఆనవాళ్లు..
ఆదివారం రాత్రి కాల్ డేటా ఆధారంగా సంబంధిత వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిసింది. ఆయుధాలను రాత్రికి రాత్రే ఇతర ప్రాంతాలకు తరలించినట్లు ఆనవాళ్లు లభించకపోవడంతో రెజిమెంట్ సిబ్బందిపైనే అనుమానాలు బలపడుతున్నట్లు తెలిసింది. ఆయుధాల మిస్సింగ్ వెనుక ఆర్మీ సిబ్బంది ప్రమేయం ఉందా లేక బయటి వ్యక్తులకు రెజిమెంట్‌లోని సిబ్బంది ఎవరైనా సహకరించారా అనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని, రహస్యంగా దర్యాప్తు చేస్తున్నారు.
అసత్యాలు ప్రచారం చేయొద్దు..
ఇది దేశభద్రతతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం. దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేం. ప్రజల్లో అయోమయం సృష్టించేలా ఎలాంటి ఊహాజనిత వార్తలను ప్రచారం చేయవద్దని కోరుతున్నాం. - శ్రీధర్, డీసీపీ, మల్కాజ్‌గిరి
