- స్టీరింగ్ రాడ్ విరగడంతో ప్రమాదం
- చిగురుమామిడి మండలం సుందరగిరిలో ఘటన
తిమ్మాపూర్ (చిగురుమామిడి), వెలుగు: స్టీరింగ్ రాడ్ విరగడంతో అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు బావిలో పడబోయి అంచున ఆగింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరిలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం 50 మంది ప్రయాణికులతో హుస్నాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తోంది.
కొత్తపల్లి ఫోర్ లేన్ రోడ్డు పనుల జరుగుతుండడంతో సుందరగిరి వద్ద బస్సు ఒక్కసారిగా ఎగిరిపడడంతో స్టీరింగ్ రాడ్ విరిగిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కనే ఉన్న కావటి బక్కయ్యకు చెందిన వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది.
బావి అంచుకు వెళ్లాక ముందు టైర్ బావిలోకి వేలాడుతూ బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆర్టీసీ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో బస్సును పక్కకు తీశారు.
