మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసం .. 19 రాష్ట్రాల్లో రూ. 5.30 కోట్లు వసూలు..

మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసం .. 19 రాష్ట్రాల్లో రూ. 5.30 కోట్లు వసూలు..

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు : మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసం చేస్తున్న వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం 140 మంది నుంచి రూ. 5.30 కోట్లు తీసుకున్నట్లు గుర్తించారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ అఖిల్​మహాజన్ బుధవారం వెల్లడించారు. నేరడిగొండ మండలం వడూర్​గ్రామానికి చెందిన సమీర్ సయ్యద్ ఇచ్చోడలో మొబైల్​షాప్​నిర్వహిస్తున్నాడు.

మొబైల్ చార్జర్లు, డిస్ ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో జులై  25న ఇన్‌‌‌‌‌‌‌‌స్టాగ్రామ్‌‌‌‌‌‌‌‌లో వెతకగా.. 'రాజ్​ఎల్ఈడీ ముంబాయి' పేరుతో ఉన్న ఐడీ కనిపించింది. అందులో ఉన్న నంబర్ కు ఫోన్ చేయగా.. మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో డబ్బులు చెల్లిస్తే  కొరియర్ ద్వారా పరికరాలు పంపిస్తామని అవతలి వ్యక్తి చెప్పాడు. నిజమేనని నమ్మిన సమీర్ వారు పంపించిన క్యూఆర్ కోడ్ కు జులై 25 నుంచి ఆగస్ట్ 8 వరకు విడతల వారీగా రూ.2,18,000 చెల్లించాడు.

దీంతో కొరియర్ రశీదును వాట్సప్ లో పంపించిన నిందితుడు మొబైల్ యాక్సెసరీస్ మజీసా ఎయిర్​ఎక్స్​ప్రెస్​ అందుతాయని చెప్పాడు. సదరు కొరియర్​సంస్థ స్థానికంగా లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన సమీర్ ఇచ్చోడ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంక్వైరీ ప్రారంభించిన పోలీసులు రాజస్తాన్ రాష్ట్రంలోని జాలోర్​జిల్లా కిలావా గ్రామానికి చెందిన ప్రకాశ్ కుమార్ మోసానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

నిందితుడి వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ. లక్ష స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలకు చెందిన సుమారు 140 మందిని మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. ఎస్పీ వెంట ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టె, ఇచ్చోడ సీఐ కె.నరేశ్​ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్సై గోపీ కృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ ఉన్నారు.