రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేత..తమిళనాడు సీఎం విజయ్

రైతులు, టీచర్లపై కేసులు ఎత్తివేత..తమిళనాడు సీఎం విజయ్

చెన్నై: రైతులు, టీచర్లు తమ హక్కులు, జీవనోపాధి, న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా చేసిన ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులన్నింటినీ వాపస్‌‌‌‌ తీస్కుంటునట్లు తమిళనాడు సీఎం విజయ్‌‌‌‌ ప్రకటించారు. 2021 మే నుంచి 2026 ఏప్రిల్‌‌‌‌ వరకు నమోదైన కేసులకు ఈ నిర్ణయం వర్తిస్తుందని ఆయన బుధవారం అసెంబ్లీలో వెల్లడించారు. మానవతా దృక్పథంతో పాటు ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 

గత ప్రభుత్వం రైతులు, టీచర్లపై అనేక కేసులు పెట్టిందని ఆరోపించారు. దీంతో ప్రజాస్వామ్య హక్కులు హరించుకుపోయాయని, కేసుల కారణంగా ఇప్పటికీ ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. టీచర్ల న్యాయమైన డిమాండ్లను తమ ప్రభుత్వం తీర్చేందుకు ప్రయత్నిస్తుందని స్పష్టం చేశారు. తిరువణ్ణామలై జిల్లాలో ఎస్‌‌‌‌ఐపీకాట్‌‌‌‌ పారిశ్రామిక వాడ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనలను విజయ్‌‌‌‌ ప్రస్తావించారు. 

పరందూర్‌లో ప్రతిపాదిత విమానాశ్రయానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళనలతోనూ రైతులపై కేసులు నమోదయ్యాయని, వ్యవసాయ భూములు, నీటి వనరులు, జీవనోపాధి కోల్పోయే ప్రమాదంపై వారు ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఈ కేసులను కూడా రద్దు చేస్తామని విజయ్‌ ప్రకటించారు.