వైఎస్సార్‌‌‌‌ ఆశయాలను నెరవేరుస్తా..ప్రాణహిత -చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణకు అంకితమిస్తా: సీఎం రేవంత్‌‌

వైఎస్సార్‌‌‌‌ ఆశయాలను నెరవేరుస్తా..ప్రాణహిత -చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణకు అంకితమిస్తా: సీఎం రేవంత్‌‌
  • రాహుల్‌‌ని ప్రధాని చేయడమే వైఎస్సార్‌‌‌‌కు నిజమైన నివాళి
  • ఇందుకు రాబోయే రెండేండ్లు కష్టపడి పని చేయాలని పిలుపు
  • వైఎస్సార్ పేదల పక్షపాతి.. ఆయన ఆదర్శాలు సజీవం: ఖర్గే
  • ఢిల్లీ కానిస్టిట్యూషన్ క్లబ్‌‌లో ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌‌కు వైఎస్సార్ అవార్డు ప్రదానం
  • డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు వివేక్, ఉత్తమ్, శ్రీధర్ బాబు, తుమ్మల తదితరులు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: ప్రాణహిత చేవెళ్ల, కల్వకుర్తి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌‌ఎల్‌‌బీసీ) టన్నెల్ ప్రాజెక్ట్‌‌లను 100 శాతం పూర్తి చేసి తెలంగాణ సమాజానికి అంకితం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తద్వారా ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్‌‌లో వైఎస్సార్ అవార్డు కార్యక్రమం జరిగింది. ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌‌కు 2026 సంవత్సరానికి గాను ‘వైఎస్ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి అవార్డు’ను ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆకలితో లక్షలాది మంది చనిపోతున్న టైంలో దార్శనికుడిగా మాజీ ప్రధాని జవహర్‌‌లాల్‌‌ నెహ్రూ.. విద్యా, ఇరిగేషన్‌‌కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు.

ఈ దిశలోనే బాక్రానంగల్, నాగార్జునసాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌‌లకు పునాదులు వేశారని చెప్పారు. నెహ్రూ ప్రారంభించిన నాగార్జునసాగర్, శ్రీశైలం, శ్రీరాం ప్రాజెక్ట్‌‌లు లక్షలాది ఎకరాలను తడపడం లేదని వైఎస్సార్ గుర్తించారని, అలా తెలంగాణలో 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా ప్రాణహిత -చేవెళ్ల, ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌‌కు బాటలు వేశారని గుర్తుచేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల, ఎస్ఎల్బీసీ 42 కిలోమీటర్ల టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణకు వస్తుందని చెప్పారు. కానీ... ఆ ఆశయం నెరవేరకుండానే వైఎస్సార్ అకాలమరణం పొందారన్నారు. ఆయన ఆశయాన్ని తెలంగాణ సహచర మంత్రులతో కలిసి తాను నెరవేరుస్తానని రేవంత్‌‌ స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీని దేశానికి ప్రధానిని చేయడమే తన లక్ష్యమని వైఎస్సార్ చెప్పారని, ఆయన చివరి కోరిక నెరవేరకుండానే మరణించారన్నారు. రాహుల్‌‌ను ప్రధానిగా చేసినప్పుడే.. వైఎస్సార్‌‌‌‌కు నిజమైన నివాళి అని అన్నారు. రాబోయే లోక్‌‌సభ ఎన్నికల్లో రాహుల్‌‌ను ప్రధాని చేయడానికి అందరం కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. 

పేదల కష్టాలు తెలుసుకున్న నేత...

కాంగ్రెస్ పార్టీ, ఇందిరా గాంధీనే రైతులకు మొట్టమొదటగా కనీస మద్దతు ధర అందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్‌‌ను తెచ్చి జమీందార్లు, భూస్వాములు, జాగీర్‌‌‌‌దార్ల నుంచి అదనపు భూములను సేకరించి, పేదలకు పట్టాలు పంచారని గుర్తుచేశారు. అలాగే, పబ్లిక్ డిస్ట్రీబ్యూషన్ స్కీమ్‌‌ (పీడీఎస్) తెచ్చి పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర సరుకులను ప్రభుత్వం ఫ్రీగా ఇస్తుందన్నారు. రాష్ట్రంలో 3.48 కోట్ల మంది ప్రజలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇస్తున్నామని, ఇందుకు ఆనాటి పీడీఎస్‌‌నే స్ఫూర్తి అని చెప్పారు. ఉమ్మడి ఏపీలో 11 జిల్లాల్లో 1,500 కిలోమీటర్ల మేర ఎర్రటి ఎండలో నడిచి పేదల కష్టాలు తెలుసుకున్నారన్నారు. తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌‌ఫార్మర్లు, ఎండిపోతున్న పొలాలు చూసి... రైతుల ఆత్మగౌరవం పెరగాలంటే ఉచిత కరెంట్ ఇస్తానని మాట ఇచ్చారన్నారు. .

రైతు సంక్షేమానికి వైఎస్సార్​ ప్రాధాన్యం: భట్టి

రైతుల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు మహనీయులు ఎంఎస్‌‌ స్వామినాథన్‌‌, దివంగత సీఎం వైఎస్‌‌ రాజశేఖరరెడ్డి అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. వ్యవసాయ రంగానికి శాస్త్ర, సాంకేతిక ఫలాలను స్వామినాథన్‌‌ అందిస్తే.. రైతులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందనే భరోసాను వైఎస్సార్​ కల్పించారన్నారు. అంతకుముందు వైఎస్సార్ వ‌‌ర్ధంతి సంద‌‌ర్భంగా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు. ఇందులో మంత్రి వివేక్ వెంక‌‌ట‌‌స్వామి, ఎంపీలు మ‌‌ల్లు ర‌‌వి, సురేశ్ షెట్కార్‌‌, పోరిక బ‌‌ల‌‌రాం నాయ‌‌క్‌‌ ‌‌పాల్గొన్నారు.

వైఎస్సార్ ఒక చెరగని ముద్ర: ఖర్గే

వైఎస్సార్‌‌ని కోల్పోయి 17 ఏండ్లు అయినప్పటికీ, ఆయన స్థాపించిన ఆదర్శాలు నేటికీ సజీవంగా ఉన్నాయని ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే కొనియాడారు. ఏ రైతు, ఏ పేద కుటుంబం కనీస అవసరాలకు నోచుకోకుండా మిగిలిపోకూడదన్నదే వైఎస్సార్ సిద్ధాంతమన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం, ఇందిరమ్మ ఇండ్ల ద్వారా గూడు, భూమి లేని వారికి భూమి పంపిణీ, రైతులకు ఉచిత విద్యుత్ వంటి విప్లవాత్మక స్కీమ్‌‌లు అమలు చేసి ప్రజల గుండెల్లో వైఎస్సార్‌‌‌‌ చెరగని ముద్ర వేసుకున్నారని కీర్తించారు. రాష్ట్రంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ఖర్గే ప్రసంశలు కురిపించారు. ఓ యువ నాయకుడిలా రేవంత్ రెడ్డి ఎంతో చురుగ్గా పనిచేస్తున్నారని అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవ‌‌హారాల ఇన్‌‌చార్జ్‌‌ మీనాక్షి నటరాజన్, పీసీపీ చీఫ్ మహేశ్‌‌ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంక‌‌ట‌‌స్వామి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, కాంగ్రెస్ సీనియ‌‌ర్ నేత‌‌లు జైరాం ర‌‌మేశ్‌‌, దిగ్విజయ్ సింగ్, కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, తెలంగాణ ఎంపీలు సురేశ్ షెట్కార్‌‌, నిరంజ‌‌న్‌‌రెడ్డి, నేత‌‌లు మ‌‌ధుయాష్కి గౌడ్‌‌, సంప‌‌త్‌‌ కుమార్‌‌ తదితరులు పాల్గొన్నారు.