నివిన్ పౌలీ, మమితా బైజు జంటగా నటించిన మలయాళ చిత్రం ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ అయింది. ‘ప్రేమలు’ ఫేమ్ గిరీశ్ ఏడీ దర్శకత్వం వహించగా ఫహద్ ఫాజిల్ నిర్మాతగా వ్యవహరించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది.
శుక్రవారం సినిమా విడుదల సందర్భంగా నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఫహద్ ఫాజిల్ మాట్లాడుతూ ‘ఇటీవల హైదరాబాద్ నా సొంత ఊరులా మారింది. తరచుగా వస్తున్నాను. ‘ప్రేమలు’తో తెలుగు ప్రేక్షకులతో మా అనుబంధం మరింత బలపడింది. ఇప్పుడొస్తున్న ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ కూడా చాలా మంచి సినిమా. నివిన్ పౌలీ, మమితా బైజు చాలా బాగా నటించారు.
గిరీశ్ ఏడీ చక్కని రొమాంటిక్ కామెడీ సినిమా తీశారు. మలయాళంలో మెప్పిస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని చెప్పాడు. తెలుగులో థియేటర్స్‌లో రిలీజ్ అవుతున్న తన ఫస్ట్ సినిమా కావడంతో తనకెంతో ప్రత్యేకమని హీరో నివిన్ పౌలీ అన్నాడు.
మలయాళంలో రూ.200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం తెలుగులోనూ సెన్సేషనల్ హిట్ అవుతుందని నిర్మాతలు రవిశంకర్, నవీన్ ఎర్నేని, డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అన్నారు. డైరెక్టర్ గిరీష్ ఏడీ, నటులు శ్యామ్ మోహన్, సంగీత్ పాల్గొన్నారు.
