- కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
- ఎయిర్‌షో నిర్వహణకు గగనతల అనుమతులివ్వాలని రిక్వెస్ట్
- దేవరకద్ర డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు నామమాత్రపు లీజుపై
- భూ కేటాయింపునకు సీఎం అంగీకారం
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమిట్-2026’కు హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా నిర్వహించే ‘రక్షణ ఎక్స్‌పో 2026’ను ప్రారంభించాలని కోరారు. బుధవారం ఢిల్లీలో రాజ్‌నాథ్ సింగ్‌తో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు ఎం.అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేశ్ షెట్కార్, పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రొటోకాల్) హర్కార వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు. రక్షణ ఎక్స్‌పోలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సుతోపాటు ప్రతిష్టాత్మక ఎయిర్‌షో, పారిశ్రామిక, భూ రక్షణ వ్యవస్థల ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా రక్షణ రంగ పరిశ్రమలు, స్టార్టప్‌లు, యువ శాస్త్రవేత్తలు పాల్గొనే రక్షణ ఎక్స్‌పోకు రక్షణ శాఖ మంత్రి హాజరై మార్గనిర్దేశం చేస్తే, వారికి ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే ‘డిఫెన్స్ ఎక్స్‌పో–2026’కు స్వాగతం పలికేందుకు తమ ప్రభుత్వం ఎదురుచూస్తోందని వివరించారు.
‘రక్షణ ఎక్స్‌పో–2026’ను అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవంతంగా నిర్వహించేందుకు రక్షణ శాఖ సహకరించాలని రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. ఎయిర్‌షో నిర్వహణకు అవసరమైన గగనతల అనుమతులు ఇవ్వడంతోపాటు భారత వైమానిక దళానికి చెందిన విమానాలు, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాలు ప్రదర్శనలో పాల్గొనేలా సహకరించాలని కోరారు. స్టాటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రదర్శనకు సహకరించాలన్నారు. భూ, నౌకా, వైమానిక దళాలకు చెందిన అత్యాధునిక రక్షణ వ్యవస్థలను ప్రదర్శనలో ఏర్పాటు చేయాలని, త్రివిధ దళాల ఉన్నతాధికారులు, ప్రతినిధులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, ఎండీఎల్ తదితర రక్షణ ప్రభుత్వ రంగ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలలు రక్షణ ఎక్స్‌పోలో విస్తృతంగా పాల్గొని.. స్వదేశీ రక్షణ సాంకేతికతను ప్రదర్శించాలని కోరారు. విదేశీ రక్షణ శాఖ ప్రతినిధులు, ద్వైపాక్షిక రక్షణ ప్రతినిధి బృందాలు, అంతర్జాతీయ రక్షణ సంస్థల ప్రముఖులతో సమావేశాలు నిర్వహించేందుకు కేంద్ర రక్షణ శాఖ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
డీఆర్‌డీఎల్ ప్రాజెక్టుకు భూమి..
ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 750 ఎకరాల భూ సేకరణ చేపట్టిందని కేంద్రమంత్రికి రేవంత్ వివరించారు. రక్షణ శాఖ మొత్తం 1500 ఎకరాలు కోరినందున.. మరో 750 ఎకరాలు సేకరించి ఇచ్చేందుకు సీఎం అంగీకారం తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల (డీఆర్‌డీఎల్) ఆధ్వర్యంలో చేపట్టనున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు ఇప్పటికే టీజీఐఐసీ అంగీకరించిందని తెలిపారు. ఎకరానికి కాకుండా మొత్తం భూమికి ఏడాదికి కేవలం ఒక రూపాయి నామమాత్రపు లీజు అద్దెతో 33 ఏండ్ల కాలానికి భూమిని కేటాయించనున్నట్టు వివరించారు. అవసరమైతే దానిని మరో రెండుసార్లు లీజు పొడిగించుకునే అవకాశం ఉందని తెలిపారు.
