న్యూఢిల్లీ: గ్లోబల్ టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత మరింత తీవ్రమైంది. ట్రాకింగ్ వెబ్సైట్ Layoffs.fyi డేటా ప్రకారం, 2026లో ఇప్పటివరకు 289 టెక్ సంస్థలు 1,23,305 మందిని తీసేశాయి. ఏడాది ముగియడానికి ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. 2025 పూర్తి సంవత్సరంలో నమోదైన 1,22,606 (278 కంపెనీల్లో) ఉద్యోగాల కోత రికార్డును 2026 అధిగమించింది. ఈ భారీ కోతల్లో టెక్ దిగ్గజాల వాటాయే అధికంగా ఉంది.
సుమారు 21,000 ఉద్యోగాల తొలగింపుతో ఒరాకిల్ అగ్రస్థానంలో ఉండగా, అమెజాన్ (17,267), డెల్ (11,000), మెటా (10,400), మైక్రోసాఫ్ట్ (4,800) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఒరాకిల్ భారత్లోనే సుమారు 2 వేల నుంచి 3 వేల మందిని సెప్టెంబర్ 1 నుంచి తొలగిస్తానని ప్రకటించింది. ఇటీవల జొమాటో సైతం 250 మందిని తొలగించింది. కంపెనీలు ఏఐ, ఆటోమేషన్ కోసం భారీగా ఖర్చు చేస్తుండడంతో ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి.
ఉబర్లో 3,300 మందిపై వేటు
క్యాబ్ సర్వీసెస్ కంపెనీ ఉబర్ టెక్నాలజీస్ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3,300 మంది ఉద్యోగులను తీసేయాలని నిర్ణయించింది. ఇది మొత్తం సిబ్బందిలో 10 శాతానికి సమానం. రీస్ట్రక్చరింగ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. నిర్వహణ ఖర్చులను తగ్గించి, ఆ నిధులను రైడ్-షేరింగ్, డెలివరీ, రోబోట్యాక్సీ విభాగాలలోకి మళ్లించాలని చూస్తోంది. ఈ తొలగింపులతో ఉబర్ మొత్తం ఉద్యోగుల సంఖ్య దాదాపు 30 వేలకు తగ్గుతుంది.
