ఖమ్మం, వెలుగు : సీతారామ ప్రాజెక్టు కాల్వల నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసిత రైతులకు బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం ఎకరాకు రూ. 25 లక్షలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మాదినేని రమేశ్, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం నిర్వాసిత రైతులతో కలిసి ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను త్యాగం చేస్తున్న రైతులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కామేపల్లి, ఏన్కూరు మండలాల్లోని పలు గ్రామాల్లో 2017–18లో సర్వే చేసి 2020లో ఎకరాకు రూ.10.50 లక్షల చొప్పున నామమాత్రపు అవార్డు ప్రకటించారన్నారు. ఆరున్నరేండ్లు గడుస్తున్నందున ఆ అవార్డు చెల్లదని స్పష్టం చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం న్యాయమైన పరిహారం ఇవ్వకపోతే కాల్వల తవ్వకం పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
అనంతరం భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు దుగ్గి కృష్ణ, తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కే. మీరా, ప్రతాపనేని వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
