ములకలపల్లి, వెలుగు: హైదరాబాద్‌లో హత్యకు గురైన ఊకే శిరీష కుటుంబానికి అండగా ఉంటానని అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ఊకే శిరీష డెడ్‌బాడీ ఆదివారం రాత్రి గ్రామానికి చేరుకుంది. ఎమ్మెల్యే గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చి, ధైర్యం చెప్పారు. సోమవారం జరిగిన అంత్యక్రియల్లో అన్నీతానై పాడె మోశారు.
కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని, తనవంతు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు. శిరీష మృతదేహానికి మాజీ ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు, దమ్మపేట మాజీ జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు బత్తుల అంజి, జహీరుద్దీన్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి కట్టం స్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, కారం సుధీర్, ఆదివాసీ నాయకులు ఊకే రవి, సోయం వీరభద్రం తదితరులు నివాళులర్పించారు. ములకలపల్లిలో ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.
